Begin typing your search above and press return to search.

ట్రంప్‌ కు మ‌ద్ద‌తుగా...మ‌నోళ్లు ర్యాలీ తీశారే!

By:  Tupaki Desk   |   4 Feb 2018 5:56 PM GMT
ట్రంప్‌ కు మ‌ద్ద‌తుగా...మ‌నోళ్లు ర్యాలీ తీశారే!
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కు అనూహ్య మ‌ద్ద‌తు ద‌క్కింది. ప్రతిభ ఆధారిత ఇమ్మిగ్రేషన్‌ విధానాన్ని తీసుకురావాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయానికి మద్దతుగా అమెరికాలోని భారతీయులు ర్యాలీ నిర్వహించారు. వాషింగ్టన్‌ లోని శ్వేతసౌధం ముందు శనివారం నిర్వహించిన ఈ ర్యాలీలో భారతీయ అమెరికన్లు ప్లకార్డులతో ట్రంప్‌నకు మద్దతు తెలిపారు. ర్యాలీలో పాల్గొన్నవారిలో ఎక్కువమంది సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగులే ఉన్నారు.

తమ దేశాన్ని ప్రేమించేవారు - గౌరవించేవారు - తమ సమాజం కోసం పాటు పడేవారు - ప్రతిభావంతుల కోసం ప్రతిభ ఆధారిత ఇమ్మిగ్రేషన్‌ విధానాన్ని తీసుకురానున్నట్లు - లాటరీ వీసా వ్యవస్థకు తాను ముగింపు పలుకబోతున్నట్లు గతవారం కాంగ్రెస్‌ ఉభయసభలనుద్దేశించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన ప్రసంగంలో వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై అమెరికాలో గ్రీన్‌ కార్డు కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న భారతీయులు హర్షం వ్యక్తం చేశారు. కొన్ని దశాబ్దాలుగా గ్రీన్‌ కార్డు కోసం వేచిచూస్తున్న అమెరికాలోని అనేక మంది భారతీయులు తమ కుటుంబసభ్యులతో సహా శ్వేతసౌధం ముందు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. వీసా పరిమితి ఎత్తివేయాలని, ప్రతిభ ఆధారిత ఇమ్మిగ్రేషన్‌కు తాము మద్దతు తెలుపుతున్నట్లు ప్లకార్డులను ప్రదర్శించారు.

‘ప్రతిభ ఆధారిత ఇమ్మిగ్రేషన్‌ అమలు కోసం మేం ఎదురుచూస్తున్నాం. ఎంతోమంది గ్రీన్‌కార్డు కోసం వేచిచూస్తున్న ప్రతిభావంతులైన భారతీయ అమెరికన్లకు ఇది తోడ్పడుతుంది. ఈ విధానం అమెరికా శ్రేయస్సుకు, ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది’ అని రిపబ్లికన్‌ హిందూ అలియన్స్‌ పొలిటికల్‌ డైరెక్టర్‌ కృష్ణా బన్సాల్‌ అభిప్రాయపడ్డారు. ట్రంప్‌ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అమెరికాలోని కాలిఫోర్నియా - టెక్సాస్‌ - షికాగో - ఫ్లోరిడా - న్యూయార్క్‌ - మస్సాచుసెట్స్‌ వంటి నగరాల్లో శాశ్వతం నివాసం ఏర్పరచుకునేందుకు వేచిచూస్తున్న అనేక మంది ప్రతిభావంతులైన భారతీయులకు మార్గం సుగమం కానుంది పలువురు భావిస్తున్నారు.