Begin typing your search above and press return to search.

డిసెంబరు 31న అదరగొట్టేసిన వాట్సాప్

By:  Tupaki Desk   |   5 Jan 2020 5:06 AM GMT
డిసెంబరు 31న అదరగొట్టేసిన వాట్సాప్
X
అక్షరాల వంద బిలియన్లు. కాస్త అర్థమయ్యేలా చెప్పాలంటే 10వేల కోట్లు. ఈ పదాన్ని అంకెల్లో రాయాలంటే ఒకటికి పదిసార్లు అయినా లెక్క పెట్టుకొని మాత్రమే రాయగలుగుతారు. అంకె రాసేందుకే ఇంత ఇబ్బంది అయితే.. అన్ని మెసేజ్ ల్ని ఒక్కరోజు వ్యవధిలో డెలివరీ చేయటం ద్వారా రికార్డును క్రియేట్ చేసింది వాట్సాప్. కొత్త సంవత్సరానికి ఒక్క రోజు ముందు.. ఈ తిరుగులేని రికార్డును క్రియేట్ చేయటం ద్వారా వాట్సాప్ సంచలనంగా మారింది.

స్మార్ట్ ఫోన్ ఏదైనా అందులో వాట్సాప్ లేకుండా ఉండేవారు కనిపించరు. 2020 సంవత్సరానికి ఒక్క రోజు ముందు ప్రపంచ వ్యాప్తంగా 10వేల కోట్ల మెసేజ్ లను డెలివరీ చేసినట్లుగా వాట్సాప్ వెల్లడించింది. ఇదో రికార్డుగా ఆ సంస్థ వెల్లడించింది. తాము డెలివరీ చేసిన 100 బిలియన్ మెసేజ్ లలో.. 20 బిలియన్ మెసేజ్ లు కేవలం భారత్ లోనివేనని పేర్కొంది. మొత్తం వాట్సాప్ డెలివరీ చేసిన మెసేజ్ లలో ఐదో వంతు మనవి కావటం ఒక విశేషం అయితే..ఇన్ని మెసేజ్ లు ఒక్కరోజులో డెలివరీ కావటం వాట్సాప్ చరిత్రలో ఇదే తొలిసారి అని చెబుతున్నారు.

తాము డెలివరీ చేసిన 100 బిలియన్ మెసేజ్ లలో 12 బిలియన్లు ఫోటోలేనని పేర్కొంది. ఒకప్పుడు న్యూఇయర్ వస్తుందంటే గ్రీటింగ్ కార్డులను పెద్ద ఎత్తున కొనుగోలు చేసి ఇచ్చుకునేవారు. తర్వాతికాలంలో మొయిల్స్ వచ్చిన తర్వాత.. గ్రీటింగ్ కార్డులనుకొనుగోలు చేయటం మానేసి.. మొయిల్ ద్వారా పంపారు.
ఎప్పుడైతే మెసేజింగ్ యాప్ వాట్సాప్ వచ్చిందో.. గ్రీటింగ్స్ చెప్పుకునే తీరులో పూర్తిగా మార్పు వచ్చేసింది. శుభాకాంక్షలు చెప్పేందుకు వాట్సాప్ కు మించింది మరొకటి లేదన్నట్లుగా పరిస్థితి మారింది. దీనికి తగ్గట్లే తాజాగా నమోదైన 100 బిలియన్ రికార్డును చూస్తే.. రానున్నరోజుల్లో వాట్సాప్ ప్రభావం ఎంతన్న విషయం తాజా ఉదంతం చెప్పేసిందని చెప్పాలి. ఫేస్ బుక్ సంస్థకు చెందిన వాట్సాప్.. రానున్న రోజుల్లో మనిషి జీవితాన్ని మరింత ప్రభావితం చేయటం ఖాయమని చెప్పక తప్పదు.