Begin typing your search above and press return to search.

పారిన్లో చ‌దువుకు మ‌నోళ్ల ఖ‌ర్చు ఎంతంటే?

By:  Tupaki Desk   |   30 Dec 2017 3:30 PM GMT
పారిన్లో చ‌దువుకు మ‌నోళ్ల ఖ‌ర్చు ఎంతంటే?
X
ఆస‌క్తిక‌ర‌మైన నివేదిక ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇప్ప‌టికే తెలిసిన నిజం మ‌రోసారి ఈ నివేదిక ద్వారా మ‌రో కోణంలో ఆవిష్కృత‌మైంద‌ని చెప్పాలి. దేశంలో 130 కోట్ల ప్ల‌స్ ఉన్న‌ప్ప‌టికీ.. అందులో సంప‌న్నుల శాతం చాలా చాలా త‌క్కువ‌న్న సంగ‌తి తెలిసిందే. అంతేనా.. దేశంలో ఇంత‌మంది ఉన్నా.. కేవ‌లం ఐదున్న‌ర ల‌క్ష‌ల మంది త‌మ ఉన్న‌త విద్య కోసం చేసే ఖ‌ర్చుతో పోలిస్తే.. దేశం మొత్తానికి ప్ర‌భుత్వం విద్య కోసం పెట్టే ఖ‌ర్చు ఇంచుమించు స‌రిస‌మాన‌మ‌న్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ మాట‌కు వ‌స్తే.. ప్ర‌భుత్వం కంటే వ్య‌క్తిగ‌తం పెడుతున్న ఖ‌ర్చే అధిక‌మ‌ని తేలింది.

ఈ లెక్క చూస్తేనే.. దేశంలోని ప్ర‌భుత్వాలు విద్య‌కు ఇచ్చే ప్రాధాన్య‌త ఏ పాటిదో ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న దేశాల్లో 86 దేశాల్లో భార‌త విద్యార్థులు 5,53,440 మంది చ‌దువుతున్న‌ట్లుగా తేలింది. ఇందులో అమెరికా.. కెన‌డా.. ఆస్ట్రేలియా దేశాల్లో చ‌దువుకునే వారే 3.70 ల‌క్ష‌ల మంది ఉంటార‌ని తేలింది. ఒక్క అమెరికాలో చ‌దువుకునే విదేశీయుల సంఖ్య ఏకంగా 11 ల‌క్ష‌లు అయితే.. అందులో చైనా 2.6 ల‌క్ష‌ల మంది ఉంటార‌ని.. త‌ర్వాతి స్థానం భార‌త్ దేన‌ని తేలింది.

ఒక్కో భార‌త విద్యార్థి ట్యూష‌న్ ఫీజు త‌దిత‌రాల కోసం ఏటా పెట్టే ఖ‌ర్చు రూ.15ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంచ‌నా. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎడ్యుకేష‌న్ సంస్థ స‌ర్వే ప్ర‌కారం 2016-17లో భార‌తీయ విద్యార్థులు ఒక్క అమెరికాలో చ‌దువు కోసం పెట్టిన ఖ‌ర్చు దాదాపు రూ.42వేల కోట్లుగా చెబుతున్నారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. అదే ఏడాదికి దేశ వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌ల కోసం కేంద్ర‌.. రాష్ట్ర ప్ర‌భుత్వాలు చేసిన ఖ‌ర్చు కేవ‌లం రూ.29,700 కోట్లుగా తేలింది. అంటే అమెరికాలో మ‌న విద్యార్థులు చేసే ఖ‌ర్చు కేంద్ర‌.. రాష్ట్ర ప్ర‌భుత్వాలు చేసే ఖ‌ర్చు కంటే రూ.12వేల కోట్లు అధికంగా ఉండ‌టం గ‌మ‌నార్హం.

చ‌దువుల కోసం దేశంలోని కొన్ని వ‌ర్గాల వారు ఇంత భారీగా ఖ‌ర్చు చేస్తున్న నేప‌థ్యంలో.. దాన్నో వ్యాపారంగా చేస్తే ప్ర‌యోజ‌నం ఉంటుందా? అంటే లేద‌నే మాట వినిపిస్తోంది. ఎందుకంటే.. విదేశాల్లో చ‌దివే వారికి అందుకు త‌గ్గ‌ట్లు ఉపాధి అవ‌కాశాలు వ‌చ్చే వీలు ఉండ‌టంతో ఎక్కువ మంది విదేశీ విద్య మీద దృష్టి సారిస్తున్నారు. ఇంత భారీగా ఖ‌ర్చు పెడుతున్న నేప‌థ్యంలో.. దేశంలోని కోట్లాది మంది ప్ర‌జ‌ల విద్య కోసం ప్ర‌భుత్వాలు చేసే ఖ‌ర్చును మ‌రింత పెంచాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న్న గుర్తిస్తే మంచిది