Begin typing your search above and press return to search.

ఇండియాటుడే సర్వే.. తెలంగాణలో ప్రజల మూడ్ ఇదేనట

By:  Tupaki Desk   |   22 Jan 2022 4:52 AM GMT
ఇండియాటుడే సర్వే.. తెలంగాణలో ప్రజల మూడ్ ఇదేనట
X
ప్రఖ్యాత మీడియా సంస్థ ఇండియాటూడు - సీ ఓటరు కలిసి నిర్వహించిన ‘‘మూడ్ ఆఫ్ ది నేషన్’’ సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో కేంద్రంలో మోడీ సర్కారుకు.. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వానికి తిరుగులేదన్న విషయాన్ని పేర్కొన్నాయి. ఆసక్తికరంగా అటు కేంద్రంలోని మోడీ సర్కారుకు.. ఇటు తెలంగాణ రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉందంటూ ప్రచారం జరుగుతున్న వేళ.. అందుకు భిన్నంగా సర్వే ఫలితాలు రావటం గమనార్హం.

తాము చేసిన సర్వే ఫలితాల్ని తాజాగా ఇండియా టుడే తన సంచికలో ప్రచురించింది. దీని ప్రకారం చూస్తే..

- తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 17 లోక్ సభ స్థానాలకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే 6 స్థానాలు బీజేపీకి వస్తాయి.

- 2019 లోక్ సభ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే.. రెండు ఎంపీ స్థానాలు అదనంగా బీజేపీ ఖాతాలో పడనున్నాయి.

- 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్.. ఎంఐఎంలు 10 స్థానాల్ని సొంతం చేసుకోగా.. తాజాగా జరిపిన సర్వేలో 9 స్థానాలకు పరిమితం అవుతాయని పేర్కొంది.

- అంటే.. అధికార టీఆర్ఎస్ ఒక స్థానాన్ని పోగొట్టుకోనుందన్న మాట.

- రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడిందన్న అభిప్రాయానికి భిన్నంగా సర్వే ఫలితం ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ కు మరింత నష్టం వాటిల్లుతుందని.. ఇప్పుడు ఆ పార్టీకి రెండు చోట్ల మాత్రమే గెలిచే వీలుందని పేర్కొంది. గత ఎన్నికల్లో మూడు స్థానాల్లో గెలవగా.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. రెండు స్థానాలకే పరిమితమవుతుందని స్పష్టం చేసింది.

- జాతీయ స్థాయిలో చూస్తే.. ఈ సర్వేలో మోడీ హవా నడుస్తున్నట్లుగా పేర్కొంది. 2021 ఆగస్టులో 54 శాతం ఉన్న మోడీ పని తీరు.. ఇప్పుడు వారి సంఖ్య 62.8 శాతానికి పెరిగిందని.. వారంతా మోడీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తుందని పేర్కొనటం గమనార్హం. అయితే.. 2020 ఆగస్టు నాడు మోడీకి దక్కిన 78 శాతం ప్రజాదరణ కంటే ఇది తక్కువే కావటం గమనార్హం.

- ప్రజాదరణ విషయంలో మోడీకి రాహుల్ కు పోలికే లేదన్న విషయం మరోసారి స్పష్టమైంది. ప్రధానిగా మోడీనే ఉండాలని 52.5 శాతం మంది కోరుకుంటుంటే.. రాహుల్ ను ప్రధానిగా చూడాలని కేవలం 6.8 శాతం మంది మాత్రమే తమ అభిలాషను వ్యక్తం చేయటం గమనార్హం.

- ఎన్డీయే పని తీరు మెరుగుపడిందని.. 58.7 శాతం మంది మోడీ సర్కారు పని తీరు పట్ల సంతృప్తిగా ఉన్నారని సర్వే పేర్కొంది.

- నిరుద్యోగం.. ధరల పెరుగుదల మోడీ ప్రభుత్వ వైఫల్యాలుగా ప్రజలు గుర్తించినప్పటికీ.. ఆయన దేశ ఆర్థిక వ్యవస్థను బాగానే నిర్వహిస్తున్నట్లుగా 51.9శాతం ప్రజలు భావిస్తున్నట్లుగా పేర్కొన్నారు.