Begin typing your search above and press return to search.

నిషేధంపై జేసీనే గెలిచారా?

By:  Tupaki Desk   |   19 July 2017 11:31 AM GMT
నిషేధంపై జేసీనే గెలిచారా?
X
దురుసు వ‌ర్త‌న‌కు కేరాఫ్ అడ్రెస్‌గానే కాకుండా వివాదాల‌కు కేంద్ర బిందువుగా మారిపోయిన టీడీపీ నేత‌, అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి ఓ విష‌యంలో విజయం సాధించిన‌ట్టే క‌నిపిస్తున్నారు. త‌నపై విమాన‌యాన సంస్థ‌లు విధించిన నిషేధాన్ని ఎత్తివేయించుకునేందుకు రంగంలోకి దిగిన జేసీ... ఆ దిశ‌గా తొలి విజ‌యం సాధించేసిన‌ట్లుగానే క‌నిపిస్తోంది. జేసీపై అమ‌ల‌వుతున్న నిషేధాన్ని ఎత్తివేస్తున్న‌ట్లు ఇండిగో ఎయిర్ లైన్స్ కాసేప‌టి క్రితం ప్ర‌క‌టించింది. మిగిలిన ఎయిర్ లైన్స్ సంస్థ‌లు జేపీపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయ‌కున్నా... ఆ దిశ‌గా ఇండిగో ఎయిర్ లైన్స్ తొలి స్టెప్ వేసిన నేప‌థ్యంలో జేసీపై నిషేధాన్ని ఎత్తివేస్తూ మిగిలిన విమాన‌యాన సంస్థ‌లు ఉత్త‌ర్వులు జారీ చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

పార్టీ యువ ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు పెళ్లి కోసం విశాఖ వెళ్లిన జేసీ దివాక‌ర్ రెడ్డి... తిరుగు ప్ర‌యాణంలో భాగంగా విశాఖ ఎయిర్ పోర్టులో నానా వీరంగం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. నిర్ణీత స‌మ‌యం కంటే చాలా ఆల‌స్యంగా వ‌చ్చిన జేసీ... త‌న‌కే బోర్డింగ్ పాస్ ఇవ్వ‌రా అంటూ ఎయిర్ ఇండియా సిబ్బందిపై చిందులేశారు. అక్క‌డే ఉన్న బోర్డింగ్ పాస్ ఇచ్చే యంత్రాన్ని కింద‌ప‌డేశారు. అడ్డొచ్చిన ఎయిర్ పోర్టు ఉద్యోగిని తోసేశారు. ఈ ఘ‌ట‌న‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ఎయిర్ లైన్స్ సంస్థ‌లు అప్ప‌టిక‌ప్పుడే జేసీపై నిషేధం విధిస్తూ ప్ర‌క‌ట‌న‌లు చేశాయి. దీంతో షాక్ తిన్న జేసీ... ఆ స‌మ‌యంలో అక్క‌డే ఉన్న కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు స‌హ‌కారంతో ఆ ఒక్క‌సారిగా ఎలాగోలా ఫ్లైట్ ఎక్కారు.

ఆ త‌ర్వాత ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్న కార‌ణంగా ఆయ‌న విదేశీయానానికి ఎలాంటి ఇబ్బంది క‌ల‌గలేదు. ఈ విష‌యంలో పంతాలకు పోతే ప‌ని కాద‌ని, బాధ్య‌తాయుత‌మైన ప్ర‌జాప్ర‌తినిధులుగా ఉన్న మ‌నం... స‌ర్దుకుపోవాల్సిందేన‌ని, ఎయిర్ లైన్స్ సంస్థ‌కు సారీ చెప్పేసి వివాదాన్ని ముగించుకోవాల‌ని పార్టీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు చేసిన సూచ‌న‌ను కూడా జేసీ ప‌ట్టించుకోలేదు. అంతేనా... ఏకంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చెప్పినా కూడా జేసీ దారికి రాలేదు. మీరు విమానం ఎక్కించుకోక‌పోతే... చార్టెర్డ్ ఎయిర్‌ క్రాఫ్ట్‌ల‌ను వినియోగిస్తానంటూ జేసీ ఎయిర్ లైన్స్ సంస్థ‌ల‌కు సారీ చెప్పే స‌మ‌స్యే లేద‌ని తేల్చేశారు.

ఇందులో భాగంగానే మొన్న ఢిల్లీకి వెళ్లిన సంద‌ర్భంగా ఏకంగా రూ.7 ల‌క్ష‌లు పెట్టి మ‌రీ చార్టెర్డ్ ఫ్లైట్ ను అద్దెకు తీసుకుని మ‌రీ వెళ్లారు. ఈ క్ర‌మంలో ఏం జ‌రిగిందో తెలియ‌దు గానీ... జేసీపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్న‌ట్లు ఇండిగో ఎయిర్ లైన్స్ ప్ర‌క‌టించింది. ఇక మిగిలిన ఎయిర్ లైన్స్ సంస్థ‌లు కూడా ఇండిగో బాట‌లోనే ప‌య‌నిస్తాయ‌ని భావిస్తున్నారు. ఒక్క‌సారిగా జేసీపై సాఫ్ట్ యాంగిల్ నిర్ణ‌యం తీసుకోవ‌డానికి గ‌ల కార‌ణాల‌ను ఇండిగో ఎయిర్ లైన్స్ వెల్ల‌డించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.