Begin typing your search above and press return to search.

పీవీ సింధు విష‌యంలో ఇండిగో త‌ప్పులేద‌ట

By:  Tupaki Desk   |   5 Nov 2017 4:29 AM GMT
పీవీ సింధు విష‌యంలో ఇండిగో త‌ప్పులేద‌ట
X
భార‌త బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి, ఒలంపిక్ సిల్వ‌ర్ మెడ‌ల్ విజేత పీవీ సింధుకు విమానాశ్ర‌యంలో ఎదురైన చేదు అనుభ‌వం కీల‌క మ‌లుపు తిరిగింది! ఇండిగో విమానంలో త‌న‌కు చేదు అనుభ‌వం ఎదురైందని సింధు చేసిన ట్వీట్ దేశ వ్యాప్తంగా తీవ్ర క‌ల‌క‌లం రేపింది. ఇండిగో ప్లేన్ గ్రౌండ్ స్టాఫ్‌ అజితేజ్ అనే వ్య‌క్తి త‌న‌తో అనాగ‌రికంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని, తాను తీవ్రంగా బాధ‌ప‌డ్డాన‌ని, ఓ మ‌హిళా సిబ్బంది ఎంత చెబుతున్నా.. అజితేజ్ వినిపించుకోలేద‌ని సింధు ట్వీట్ చేసింది. సింధు వంటి పెద్ద స్టార్ ఇటువంటి ట్వీట్ చేయ‌డంతో ఇండిగో సంస్థ‌కు చెడ్డ పేరు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంద‌రూ భావించారు. దీనికితోడు ఈ ట్వీట్ పై క్ష‌ణాల్లోనే రీ ట్వీట్లు వెల్లువెత్తాయి.

దీంతో ఈ ఘ‌ట‌న‌పై సీసీ టీవీ ఫుటేజ్‌ను స్వీకరించిన ఇండిగో సంస్థ‌.. కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనూ స‌మాధానం చెప్పింది. ఈ మొత్తం ఉదంతంలో ఇండిగో సిబ్బంది త‌ప్పు ఎంత‌మాత్ర‌మూ లేద‌ని, సింధునే అతి చేసింద‌ని సంస్థ ఆరోపించింది. పీవీ సింధు అధిక ల‌గేజీతో ప్ర‌యాణానికి సిద్ధ‌మ‌య్యార‌ని పేర్కొంది. తాము ఆ అధిక ల‌గేజీని కార్గోలోకి మారుస్తామ‌ని సింధుకి చెప్పామ‌ని , మొద‌ట ల‌గేజీని కార్గోలోకి త‌ర‌లించేందుకు సింధు అంగీక‌రించ‌లేద‌ని, చాలాసార్లు కోరిన అనంత‌రం కార్గోలోకి త‌ర‌లించేందుకు సింధు అంగీక‌రించింద‌ని ఇండిగో యాజ‌మాన్యం వివ‌ర‌ణ ఇచ్చింది.

నిజానికి అధిక ల‌గేజీతో ఎవ‌రు వ‌చ్చినా ప‌రిశీలించి వారికి త‌గు సూచ‌న‌లు చేస్తామ‌ని, ఈ నేప‌థ్యంలోనే సింధూకు కూడా సిబ్బంది త‌గు సూచ‌న‌లు చేశార‌ని, అయితే, సింధు వినిపించుకోక‌పోవ‌డం వ‌ల్లే వివాదం రేగింద‌ని ఇండిగో సుదీర్ఘ వివ‌ర‌ణ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. ఆ త‌ర్వాత చెప్ప‌గా చెప్ప‌గా సింధు త‌న కార్గోను త‌ర‌లించేందుకు అంగీక‌రించ‌లేద‌ని పేర్కొంది. అయితే, సింధు ప్ర‌ధానంగా ఆరోప‌ణ చేసిన అజితేజ్ అనే వ్య‌క్తి గురించి ఇండిగో ప్ర‌స్తావించలేదు. మొత్తానికి టీ క‌ప్పులో తుఫాను మాదిరిగా ఈ విష‌యం ఇక్క‌డితో ఆగుతుందో లేక ఇంకా పెద్ద‌ది అవుతుందా? ఏమో చూడాలి.