Begin typing your search above and press return to search.

ప‌డిపోయిన షేరు.. ఇండిగోకు పెద్ద జ‌బ్బు?

By:  Tupaki Desk   |   11 July 2019 4:34 AM GMT
ప‌డిపోయిన షేరు.. ఇండిగోకు పెద్ద జ‌బ్బు?
X
ఏం జ‌రుగుతుందో అర్థం కాని ప‌రిస్థితి. కార‌ణాలు ఏమైనా కానీ దేశంలోని విమాన‌యాన సంస్థ‌లు ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా సంక్షోభాల్లో కూరుకుపోతున్న ప‌రిస్థితి. ఆ మ‌ధ్య‌న స్పెస్.. త‌ర్వాత జెట్.. ఇటీవ‌ల కాలంలో ఎయిర్ ఇండియా.. ఇలా ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా విమాన‌యాన సంస్థ‌లు ఏదో ఒక ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయి. ఇన్ని స‌మ‌స్య‌ల న‌డుమ దేశంలో అగ్ర‌గామి ఎయిర్ లైన్స్ సంస్థ‌గా పేరున్న ఇండిగోకు మాయ‌రోగం వ‌చ్చిన‌ట్లుగా వాద‌న‌లు వినిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా ఈ మాట‌లు వినిపిస్తున్నా.. ఇవ‌న్నీ ఉత్త పుకార్లుగా కొట్టిపారేశారు.

అయితే.. ఇండిగోకు పెద్ద జ‌బ్బే వ‌చ్చింద‌ని.. దాన్ని ఇంత‌కాలం క‌వ‌ర్ చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ వాద‌న‌కు బ‌లం చేకూరుస్తూ తాజాగా స్టాక్ మార్కెట్ లో ఇండిగో షేరు 10 శాతం ప‌డిపోవ‌టంతో అంద‌రి దృష్టి ఇండిగో మీద ప‌డింది.దేశీయ మార్కెట్లో తిరుగులేని అధిక్య‌త ఉన్న ఇండిగోకు వ‌చ్చిన మాయ‌దారి రోగం ఏమిటి? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

స్టాక్ మార్కెట్ లో ఇండిగో షేరు ప‌డిపోయి.. అంద‌రూ కంగారు ప‌డుతున్న వేళ‌.. జ‌బ్బుకు కార‌ణం ఏమిట‌న్న విష‌యం ఒక లేఖ ద్వారా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌మోట‌ర్ల విభేదాల వ‌ల్ల సంస్థ‌కు.. కార్య‌క‌లాపాల‌కు ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌న్న భ‌రోసాను వ్య‌క్తం చేస్తూ సంస్థ సీఈవో ఇండిగో ఉద్యోగుల‌కు లేఖ రాయ‌టంతో అస‌లు విష‌యం ఏమిట‌న్న దానిపై కాస్తంత స్ప‌ష్ట‌త వ‌చ్చింద‌ని చెప్పాలి.

ఏడాదిగా ఇండిగో ప్ర‌మోట‌ర్ల మ‌ధ్య విభేదాలు ఉన్నాయి. అవి తాజాగా తీవ్ర‌రూపం దాల్చాయి. ఇదే తాజాగా ఆ కంపెనీ షేరు 10 శాతానికి ప‌డిపోవ‌టానికి కార‌ణంగా చెప్పాలి. ఇండిగో మాతృసంస్థ‌గా చెప్పే ఇంట‌ర్ గ్లోబ్ ఏవియేష‌న్ లో 38 శాతం వాటా ఉన్న రాహుల్ భాటియా.. ఆయ‌న‌కు చెందిన సంస్థ‌ల తీరే ఇండిగోలో పాల‌నా లోపాలు త‌లెత్తిన‌ట్లుగా చెబుతున్నారు.

ఇండిగో అంత‌ర్గ‌త పాల‌న కిళ్లీకొట్టు నిర్వాహ‌ణ క‌న్నా దారుణంగా త‌యారైంద‌ని.. ఈ విష‌యంలో సెబీ జోక్యం చేసుకోవాలంటూ సంస్థ‌లో 37 శాతం వాటా ఉన్న రాకేశ్ గంగ్వాల్ తాజాగా లేఖ రాయ‌టంతో జ‌బ్బు ఆన‌వాలు క‌నిపించ‌ట‌మే కాదు.. రోగం ఎంత‌గా ముదిరిపోయింద‌న్న విష‌యం అర్థ‌మైన ప‌రిస్థితి. చ‌ట్టాల్ని వారు బ్రేక్ చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

వారి చ‌ర్య‌లు ప్ర‌శ్నించేలా ఉన్నాయన్న‌ తీవ్ర‌ వ్యాఖ్య‌ల్ని చేశారు రాకేశ్. దీంతో క‌ల‌క‌లం రేగ‌ట‌మే కాదు.. షేరు విలువ మీదా ప్ర‌భావాన్ని చూపింది. సెబీకి రాసిన లేఖ‌ల కాపీల్ని ప్ర‌ధాని.. ఆర్థిక‌.. పౌర విమాన‌యాన‌.. వాణిజ్య శాఖ‌ల మంత్రుల‌కు పంప‌టం గ‌మ‌నార్హం. ఇదిలా ఉంటే.. ఈ వ్య‌వ‌హారంపై ఇండిగో సీఈవో రంజోయ్ దత్తా ఉద్యోగుల‌కు ఒక లేఖ రాశారు. ప్ర‌మోట‌ర్ల మ‌ధ్య విభేదాలతో ఇండిగోకు వ‌చ్చే ఇబ్బందేమీ లేదు.. అవ‌న్ని స‌ర్దుకుంటాయి. మీ విధుల్ని య‌థావిధిగా నిర్వ‌హించండి అంటూ రాసిన లేఖ కాస్తంత ఊర‌ట ఇచ్చేలా ఉన్నా.. అదెంత వ‌ర‌కూ నిజ‌మ‌న్న‌ది ఇప్పుడు క్వ‌శ్చ‌న్ గా మారింది.