Begin typing your search above and press return to search.

ఇండిగోకి చుక్క‌లు చూపించిన మాజీ ఉద్యోగి

By:  Tupaki Desk   |   14 May 2018 6:46 AM GMT
ఇండిగోకి చుక్క‌లు చూపించిన మాజీ ఉద్యోగి
X
ఇటీవ‌ల ఇండిగో ఫ్లైట్లో బాంబు ఉందంటూ ఉత్తుత్తి బెదిరింపుల‌కు పాల్ప‌డిన వైనం తెలిసిందే. విమానంలో బాంబు ఉందంటూ వ‌చ్చిన ఫోన్ కాల్‌కు త‌క్ష‌ణ‌మే స్పందించిన సిబ్బంది కిందామీదా ప‌డ్డారు. ఫ్లైట్ మొత్తాన్ని క్షుణ్ణంగా చెక్ చేసి.. త‌మ‌కు వ‌చ్చింది బెదిరింపు ఫోన్ కాల్ గా తేల్చారు.

ఈ ఇష్యూపై ద‌ర్యాప్తు జ‌రిపిన అధికారుల‌కు షాకింగ్ నిజాన్ని గుర్తించారు. అదేమంటే.. పుణేకు చెందిన 23 ఏళ్ల కార్తీక్ మాధ‌వ్ భ‌ట్ ఈ బెదిరింపు కాల్ చేసిన‌ట్లు తేల్చారు. మ‌రింత ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. కార్తీక్ ఇండిగో ఉద్యోగి కావ‌టం. తాను ప‌ని చేస్తున్న కంపెనీకి చుక్క‌లు ఎందుకు చూపించాడ‌న్న‌ది చూస్తే.. హాస్పిటాలిటీలో డిప్లొమా కోర్సు పూర్తి చేసిన కార్తీక్ ఇండిగో ఎయిర్ లైన్స్ లో క‌స్ట‌మ‌ర్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ గా జాబ్ లో చేరారు.

అయితే.. అత‌గాడి ప‌ని తీరు బాగోలేద‌ని.. మ‌రింత మెరుగుప‌డాల‌ని సీనియ‌ర్లు కార్తీక్ కు వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఇండిగో ఎయిర్ లైన్స్ కు బుద్ది చెప్పాల‌న్న కోపంతో.. మే2న ముంబ‌యికి వెళ్లే ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ కాల్ చేసి క‌ల‌క‌లం రేపాడు. అప్ర‌మ‌త్త‌మైన భ‌ద్ర‌తా సిబ్బంది రెండు గంట‌ల పాటు విమానాన్ని త‌నిఖీ తేల్చి ఫేక్ కాల్ గా తేల్చారు.

త‌న ప‌ని తీరును వంక‌లు పెట్టిన సీనియ‌ర్ల‌కు చుక్క‌లు చూపించేందుకే ఈ ప‌ని చేసిన‌ట్లుగా విచార‌ణ‌లో ఒప్పుకున్నారు. ప‌ని తీరు బాగోలేద‌న్న పాపానికి ప‌ని చేస్తున్న సంస్థ‌కే వ‌ణుకు పుట్టించిన ఇత‌గాడి వైఖ‌రి ఇప్పుడు షాకింగ్ గా మారింది.