Begin typing your search above and press return to search.

ప్ర‌యాణికిడిని దించేసిన ఇండిగో సిబ్బంది!

By:  Tupaki Desk   |   10 April 2018 9:16 AM GMT
ప్ర‌యాణికిడిని దించేసిన ఇండిగో సిబ్బంది!
X
కొద్ది రోజులుగా ఇండిగో విమాన‌యాన సంస్థ పేరు వార్త‌ల్లో ప్ర‌ముఖంగా వినిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. త‌మ‌తో ఇండిగో సిబ్బంది దురుసుగా ప్ర‌వ‌ర్తించార‌ని గ‌తంలో కొంద‌రు ప్ర‌యాణికులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మ‌రోవైపు, అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి, ప్ర‌ముఖ గాయ‌కుడు ఉదిత్ నారాయ‌ణ్ కొడుకు ఆదిత్య నారాయ‌ణ్ లు ఇండిగో సిబ్బందిని దూషించార‌ని వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా, మ‌రోసారి ఇండిగో ఎయిర్ లైన్స్ మ‌రో వివాదంలో చిక్కుకుంది. విమానంలో దోమలున్నాయని ఫిర్యాదు చేసిన ప్రయాణికుడిపై ఇండిగో సిబ్బంది దాడి చేసి, విమానం నుంచి గెంటివేశారన్న ఘ‌ట‌న చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అయితే, త‌మ సిబ్బందితో ఆ ప్ర‌యాణికుడు దురుసుగా ప్ర‌వ‌ర్తించాడ‌ని, దూషించాడ‌ని ఇండిగో సంస్థ ఆరోపిస్తోంది. ఏదేమైనా అత‌డికి క‌లిగిన అసౌక‌ర్యానికి చింతిస్తున్నామ‌ని తెలిపింది.

ల‌క్నో నుంచి బెంగళూరు వెళుతున్న ఇండిగో విమానంలో సౌరభ్ రాయ్ అనే వైద్యుడు ప్ర‌యాణిస్తున్నాడు. విమానంలో దోమలున్నాయని సిబ్బందికి అత‌డు ఫిర్యాదు చేశాడు. అయితే, త‌న ఫిర్యాదుపై సిబ్బంది నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించారు. దీంతో, అంద‌రం క‌లిసి సిబ్బందిని నిల‌దీద్దామ‌ని ప్రయాణికులకు చెప్పాడు. అంద‌రినీ రెచ్చ‌డొట్ట‌డంతో సౌర‌భ్ పై ఆగ్రహించిన సిబ్బంది సెక్యూరిటీ సాయంతో అత‌డిని బలవంతంగా విమానం నుంచి దింపేశారు. ఈ ఘటనపై తీవ్ర‌స్థాయిలో విమర్శలు వెల్లువెత్తగా.....ఇండిగో వివ‌ర‌ణ ఇచ్చింది. త‌మ సిబ్బందిని సౌర‌భ్ దూషించాడని, విమానాన్ని హైజాగ్ చేస్తానని హెచ్చరించాడ‌ని ఆరోపించింది. అంతేకాకుండా, విమానంలోని కుర్చీలను విర‌గ్గొట్టాల‌ని, విమానాన్ని ధ్వంసం చేయాలని మిగ‌తా ప్రయాణికులను రెచ్చ‌గొట్టాడ‌ని చెప్పింది. ఎన్జీటీ నిబంధనల ప్రకారం.. విమానంలో ప్రయాణికులు లేన‌పుడు మాత్ర‌మే దోమల మందు స్ప్రే చేస్తామ‌ని తెలిపింది. ఏదేమైనా, అత‌డికి జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని చెప్ప‌డం కొస‌మెరుపు. అయితే, దోమలున్నాయని ప్ర‌శ్నించినందుకు తనను ఉగ్రవాదితో పోల్చార‌ని, అంతేకాక త‌న‌పై దాడి చేసి, విమానం నుంచి బలవంతంగా దించేశారని మీడియాకు తెలిపారు.