Begin typing your search above and press return to search.

అబ్బో.. ఇండిగో తెలివే తెలివిగా?

By:  Tupaki Desk   |   30 Oct 2019 8:01 AM GMT
అబ్బో.. ఇండిగో తెలివే తెలివిగా?
X
ఆసక్తికర వార్త ఒకటి ఇవాళ చాలా పేపర్లలో కనిపించింది. దాని సారాంశం ప్రముఖ చౌకధరల విమానయాన సంస్థ ఇండిగో కొత్తగా మరో 300 విమానాలకు ఆర్డర్లు ఇచ్చిందని. దాని విలువ ఏకంగా రూ.2.31లక్షల కోట్లు. ఇంత భారీ డీల్ ను ఇండిగో ఎలా చేస్తుంది? దాని అసలు లెక్క ఏమిటి? అన్నది క్వశ్చన్. దీనికి సమాధానం వెతికితే.. ఇండిగో తెలివికి ముచ్చట పడటమే కాదు.. దాని లాంగ్ విజన్ కు ఫిదా కావాల్సిందే.

ప్రస్తుతం 420 విమానాలున్న ఇండిగో.. తాజా ఆర్డర్ తో దానికుండే విమానాల సంఖ్య 720కు చేరుతాయి. అయితే.. ఇంత భారీ ఆర్డర్ వెనుక అసలు లెక్కేమిటి? అన్న విషయంలోకి వెళితే కానీ ఇండిగో చతురత అర్థం కాదు. విమానాల్ని తయారీ చేసే సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నప్పటికీ.. డిమాండ్ కు తగ్గట్లు విమానాల్ని తయారు చేసే పరిస్థితి లేదు. చాలా సంస్థలు నెలకు ఒకట్రెండు విమానాలకు మించి డెలివరీ చేయలేని పరిస్థితి.

దీంతో.. అప్పటికప్పుడు తమకు విమానాలు కావాల్సిన సంస్థలు.. అధిక మొత్తం వెచ్చించి మరీ విమానాల్ని సొంతం చేసుకుంటాయి. ఈ విషయాన్ని గుర్తించిన ఇండిగో.. తాజాగా 300 విమానాల్ని ఆర్డర్ ఇచ్చింది. ఈ ఆర్డర్ ను డెలివరీ చేయటానికి చాలానే టైం పడుతుంది. సరిగ్గా.. తాము బుక్ చేసిన కోటా కింద విమానాలు డెలివరీ అయ్యే సమయానికి.. బయట మార్కెట్లో వాటికి పెరిగే డిమాండ్ చూసుకొని.. ఎక్కువ ధరకు అమ్మేస్తున్నారు. అలా ఒక్కో విమానాన్ని ఆర్డర్ చేసే సమయానికి.. దాన్ని డెలివరీ చేసే సమయానికి మధ్య ధరలో వచ్చే వ్యత్యాసం తక్కువలో తక్కువ రూ.70 నుంచి రూ.105 కోట్ల మేర లాభం వచ్చే పరిస్థితి.

ఈ లెక్కన తాజాగా ఇండిగో ఆర్డర్ ఇచ్చిన 300 విమానాల్ని డెలివరీ చేసే సమయానికి.. వాటికుంటే ధర పెరగటంతో వాటిని ఇతర సంస్థలకు అమ్మటం.. వాటి నుంచి లీజుకు తీసుకోవటం ద్వారా సంస్థ మరిన్ని లాభాల్ని మూటగట్టుకుంటుందని చెప్పాలి. ఇలా ఎక్కడ ఏ చిన్న అవకాశం ఉన్నా.. దాన్ని విడిచి పెట్టకుండా వ్యవహరిస్తున్న ఇండిగో సక్సెస్ స్టోరీ వెనుక ఇలాంటి ఐడియాలు చాలానే అమలు చేస్తుందని చెబుతున్నారు.