Begin typing your search above and press return to search.

షాకిచ్చే ప్ర‌క‌ట‌న చేసిన ఇండిగో..!

By:  Tupaki Desk   |   14 Feb 2019 5:36 AM GMT
షాకిచ్చే ప్ర‌క‌ట‌న చేసిన ఇండిగో..!
X
విమానంలో ప్ర‌యాణం అన్నంత‌నే అమ్మో.. అది మ‌న స్థాయి కాద‌న్న మాట‌ను చెదిరిపోయేలా చేసిన ఘ‌న‌త ఎవ‌రిదంటే అది క‌చ్ఛితంగా ఇండిగో ఎయిర్ లైన్స్ దేన‌ని చెప్పాలి. చౌక‌ధ‌ర‌ల‌తో విమాన ప్ర‌యాణాన్ని ఆకాశం నుంచి నేల‌కు దింప‌ట‌మే కాదు.. ఇప్పుడు స‌గ‌టు జీవి జ‌ర్నీలిస్ట్ లో విమాన ప్ర‌యాణం వ‌చ్చి చేరిందంటే.. దాని ఘ‌న‌తేన‌ని చెప్పాలి. అలాంటి ఇండిగో తాజాగా చేసిన ప్ర‌క‌ట‌న సంచ‌ల‌నంగా మారింది.

విమాన పైలెట్ల కొర‌త భారీగా ఉంద‌ని.. ఈ కొర‌త కార‌ణంగా త‌మ విమాన స‌ర్వీసుల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన ప్ర‌యాణికుల‌కు షాకిచ్చింది. విమాన పైలెట్ల కొర‌త‌తో మార్చి 30 వ‌ర‌కు రోజూ 30 వ‌ర‌కూ విమాన స‌ర్వీసుల్ని ర‌ద్దు చేస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించింది. గ‌డిచిన పుష్క‌ర కాలంలో ఇండిగో.. ఇంత పెద్ద ఎత్తున స‌ర్వీసుల్ని ర‌ద్దు చేయ‌టం ఇదే మొద‌టిసారిగా చెబుతున్నారు.

బెంగ‌ళూరు.. హైద‌రాబాద్‌.. చెన్నై.. కోల్ క‌తాల‌తో పాటు ప‌లు న‌గ‌రాల‌కు పెద్ద ఎత్తున స‌ర్వీసులు న‌డిపే ఇండిగో.. మార్చి 30 వ‌ర‌కూ ప‌లు స‌ర్వీసుల్ని ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ర‌ద్దు చేసిన స‌ర్వీసుల విష‌యానికి వ‌స్తే ముంబ‌యి నుంచి చెన్నై.. బెంగ‌ళూరు.. గౌహ‌తి.. కోల్ క‌తాల‌కు వెళ్లే ఇండిగో విమాన స‌ర్వీసుల‌ను ర‌ద్దు చేశారు.

పైలెట్ల కొర‌త‌ను అధిగ‌మించేందుకు విదేశీ పైలెట్ల‌ను కాంట్రాక్ట్ ప‌ద్ద‌తిలో నియ‌మించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లుగా ఇండిగో వెల్ల‌డించింది. అయితే.. విదేశీ పైలెట్ల‌ను నియ‌మించుకోవ‌టానికి పౌర విమాన‌యాన డైరెక్ట‌రేట్ ఫారిన్ ఎయిర్ క్రూ టెంప‌ర‌రీ అథ‌రైజేష‌న్ ఇవ్వాల్సి ఉంటుంది. వారి నుంచి అనుమ‌తి వ‌చ్చి.. విదేశీ పైలెట్ల‌కు ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించి.. వారికి శిక్ష‌ణ ఇచ్చి.. వారిని పైలెట్లుగా నియ‌మించేస‌రికి ఏప్రిల్ వ‌స్తుంద‌ని.. అప్ప‌టివ‌ర‌కూ ప‌లు విమాన స‌ర్వీసుల్ని ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇండిగో షాకింగ్ ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో.. ఆయా రూట్ల‌లో విమాన ఛార్జీల ధ‌ర‌లు పెర‌గ‌టం ఖాయ‌మ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.