Begin typing your search above and press return to search.

పాక్ తో వార్ వేళ ఇందిర ఏం చేశారంటే..?

By:  Tupaki Desk   |   28 April 2016 10:11 AM GMT
పాక్ తో వార్ వేళ ఇందిర ఏం చేశారంటే..?
X
ఉక్కుమహిళగా పేరున్న దివంగత ప్రధాని ఇందిరాగాంధీకి సంబంధించి పలు ఆసక్తికర అంశాలు తాజాగా బయటకు వచ్చాయి. ఆమెకు వ్యక్తిగత వైద్యుడిగా వ్యవహరించిన డాక్టర్ కేపీ మాథుర్ తాజాగా ఒక పుస్తకం రాశారు. సప్దర్ జంగ్ ఆసుపత్రిలో వైద్యుడిగా పని చేసిన మాథుర్ తర్వాత కాలంలో ఇందిరకు పర్సనల్ డాక్టర్ గా వ్యవహరించారు. నాటి గురుతుల్ని ‘‘ద అన్ సీన్ ఇందిరాగాంధీ’’ పేరు మీద ఆయన ఒక పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకంలో ఇందిరాగాంధీకి సంబంధించిన పలు అంశాల్ని ప్రస్తావించారు. వాటిల్లోకి వెళితే..

= భారత్ – పాకిస్థాన్ ల మధ్య 1971లో వార్ వేళ ఉదయాన్నే ఇందిర ఇంటికి వెళ్లాను. ఆ సమయంలో ఆమె తీరిగ్గా దివాన్ మీద దుప్పటి మారుస్తున్నారు. ముందు రోజు రాత్రి యుద్ధానికి సంబంధించిన గొడవలతో టెన్షన్ గా గడిపి ఉండొచ్చు. ఈ కారణంతోనే ఆమె రిలాక్స్ అయ్యేందుకు దుప్పటి మార్చటం లాంటి పనులు చేస్తుండొచ్చు.

= యుద్ధం ప్రారంభం అయ్యే సమయానికి ఇందిర కోల్ కతాలో ఉన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆమె ఢిల్లీకి తిరిగి వచ్చారు. విమాన ప్రయాణంలో ఆమె పెద్దగా టెన్షన్ పడలేదు. యుద్ధ వ్యూహాల గురించి ఆమె ఆలోచించారు.

= యుద్ధ సమయంలో టెన్షన్ పడని ఇందిర.. అంతకు ముందు అంటే 1966లో తాను ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టే సమయంలో మాత్రం కొంత టెన్షన్ తో కనిపించారు.

= ప్రధాని అయిన తొలి రెండు సంవత్సరాలు బాగా టెన్షన్ తో కనిపించేవారు. కాస్త గందరగోళంగా కనిపించేవారు. ఆమెకు సలహాలు ఇవ్వటానికి సలహాదారులు.. బంధువులు.. స్నేహితులు ఎవరూ లేరు.

= ఆమె టెన్షన్ పడితే ఉదయానికి ఆమె ఆరోగ్య ఇబ్బందులు ఎదుర్కొనే వారు. ఆ సందర్భంగా ఆమెకు చికిత్స చేయాల్సిన అవసరం ఉండేది.

= ఏదైనా పర్యటనకు వెళ్లే ముందు కన్నాట్ ప్లేస్ లోని సౌతిండియాకాఫీ హౌస్ నుంచి టిఫిన్లు తెప్పించుకునేవారు.

= సోనియాగాంధీని రాజీవ్ పెళ్లిచేసుకున్న సమయంలో తన కోడలు త్వరగా భారతీయు సంస్కృతికి అలవాటు పడాలని కోరుకునేవారు. ఇతరులతో మాట్లాడే సమయంలో తన కోడల్ని బహురాణీ అని వ్యవహరించేవారు.

= ఆమె పూజలు చేస్తారో లేదో తెలియదు. ఈ విషయంలో కాస్త సందేహాంగా ఉండేది. అయితే.. ఆమె ఇంట్లో ప్రత్యేకంగా పూజగది ఉండేది. అందులో చాలా విగ్రహాలు ఉండేవి. నేల మీద చిన్న చాప కూడా ఉండేది.

= ఆమె తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని.. జమ్మూకశ్మీర్ లోని వైష్ణోదేవి ఆలయాన్ని తరచూ సందర్శించేవారు.