Begin typing your search above and press return to search.

ఓట‌ర్ల మీద మోడీ బ్ర‌హ్మాస్త్రం!

By:  Tupaki Desk   |   1 Feb 2019 7:55 AM GMT
ఓట‌ర్ల మీద మోడీ బ్ర‌హ్మాస్త్రం!
X
క‌డుపు నిండినోడికి బిర్యానీ పెట్టినా.. జీడిప‌ప్పు ఫ్రై పెట్టినా పెద్ద ప్ర‌యోజ‌నం ఉండ‌దు. అదే ఆక‌లితో న‌క‌న‌క‌లాడే వాడికి కాసింత అన్నం పెట్టి.. ప‌చ్చ‌డి వేసినా సంతోష‌ప‌డిపోవ‌ట‌మే కాదు.. ఆ ఆక‌లి తీర్చినోళ్ల‌ను ఒక‌ప‌ట్టాన మ‌ర్చిపోరు. ఎంత కడుపు నిండిన త‌ర్వాత కూడా.. ఆక‌లి వేళ ముద్ద పెట్టిన చేతిని మ‌ర్చిపోలేని గుణం భార‌తీయుల్లో ఎక్కువ‌గా క‌నిపిస్తూ ఉంటుంది. ఆ విష‌యాన్ని మోడీ మాష్టారు బాగానే గుర్తించిన‌ట్లున్నారు.

గ‌డిచిన నాలుగేళ్లుగా ప్ర‌వేశ పెడుతున్న వార్షిక బ‌డ్జెట్ ల‌లో వేత‌న జీవులు ఎంతో ఆశ‌గా ఎదురుచూసే ఆదాయ‌ప‌న్ను ప‌రిమితి పెంపు విష‌యంలో అట్ల‌కాడ కాల్చి వాత పెట్టిన మోడీ..ఈసారి అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించారు. ఎన్నిక‌ల వేళ త‌న అమ్ముల పొదిలోని అస్త్రాల్ని ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు తీస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఆయ‌న తాజాగా గోయ‌ల్ దొర‌ వారి చేత చ‌దివిస్తోన్న బ‌డ్జెట్ లో భారీ ఉప‌శ‌మ‌నాన్ని ప్ర‌క‌టించారు.

వేత‌న జీవుల క‌డుపు నిండిపోయేలా.. ఇంత‌కాలం మోడీ మాష్టారి మీద ఉన్న మంట మొత్తం మాయ‌మ‌య్యే వ‌రాన్ని ప్ర‌క‌టించారు. ఇంత‌కాలం వార్షిక ఆదాయం రూ.2.5 ల‌క్ష‌లు ఉన్న వారికి మాత్రం ఐటీ ప‌న్ను మిన‌హాయింపు ఉండేది. అంటే.. నెల‌కు రూ.25వేలు సంపాదించే వారికి ఐటీ ప‌న్ను దాదాపుగా ఉండ‌ని ప‌రిస్థితి. అలాంటిది ఈసారి ఏకంగా రూ.5ల‌క్ష‌ల వ‌ర‌కూ పెంచేస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తీసుకున్నారు.

గ‌డిచిన కొన్నేళ్లుగా అధికారంలో ఉన్న ప్ర‌భుత్వాలు ఆదాయ‌ప‌న్ను ప‌రిమితిని మ‌హా అయితే యాభై వేల వ‌ర‌కు మాత్ర‌మే మిన‌హాయింపు ఇచ్చేవారు. అందుకు భిన్నంగా ఈసారి ఏకంగా 2.5ల‌క్ష‌ల మిన‌హాయింపు ఇవ్వటం చూస్తే.. ఎన్నిక‌ల వేళ మోడీ సారు ఓట‌ర్ల మ‌న‌సు దోచే బ్ర‌హ్మాస్త్రాన్ని బ‌య‌ట‌కు తీశార‌నిచెప్పాలి. లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు మ‌హా అయితే.. మ‌రో ఇర‌వై రోజుల్లో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల‌వుతుంద‌ని భావిస్తున్న వేళ భారీతాయిలాన్ని బ‌య‌ట‌కు తీయ‌టం ద్వారా ఎన్నిక‌ల ఫ‌లితాల మీద ప్ర‌భావితం కావ‌టం ఖాయ‌మంటున్నారు.

మ‌ధ్య‌త‌ర‌గ‌తి.. ఎగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారు ఫిదా అయ్యేలా ఆదాయ‌ప‌న్ను మిన‌హాయింపును ప్ర‌క‌టించార‌ని చెప్పాలి. తాజాగా వెల్ల‌డించిన వ‌రం ప్ర‌కారం దాదాపు రూ.40 వేల వ‌ర‌కు నెల‌స‌రి జీతం వ‌చ్చే వారిపై ఎలాంటి భారం ఉండ‌దు. బీమా.. మ‌రికొన్ని అంశాల్లో పొదుపు చేసే అవ‌కాశం ఉన్న వారికి ఈ ప‌రిమితిని మ‌రింత పెంచుతూ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. బీమా కానీ.. పీఎఫ్ లో పొదుపు చేసుకునే వారికైతే.. నెల‌కు రూ.52వేల వ‌ర‌కూ ఆదాయం వ‌చ్చినా పైసా ట్యాక్స్ క‌ట్టాల్సిన అవ‌స‌రం లేని ప‌రిస్థితి. ఇప్ప‌టివ‌ర‌కూ బాదేసిన బాదుడుకు భిన్నంగా భారీ వ‌రాన్నిప్ర‌క‌టించిన మోడీ కార‌ణంగా ఓట‌ర్లలో సానుకూల‌త ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని చెప్పాలి. నాలుగేళ్లుగా మాడ‌బెట్టిన మోడీ.. చివ‌రి ఏడాది ఇచ్చిన వ‌రానికి ఫిదా అవుతారా? లేదా? అన్న‌ది ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చే వ‌ర‌కూ వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు.