Begin typing your search above and press return to search.

సునామీ బీభ‌త్సం...222మంది మృతి

By:  Tupaki Desk   |   24 Dec 2018 3:51 AM GMT
సునామీ బీభ‌త్సం...222మంది మృతి
X
ఇండోనేషియాపై సునామీ మరోసారి విరుచుకుపడింది. నిన్న రాత్రి 9.30 గంటల తర్వాత దక్షిణ సుమత్రా - పశ్చిమ జావాలోని బీచ్‌ ల్లో అలలు విరుచుకుపడ్డాయి. ఇప్పటికే 222మందికి పైగా మృతి చెందగా - 800మందికి పైగా గల్లంతయ్యారు. వందలాది మంది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువగా టూరిస్టులు ఉన్నారు. వందలాది భవనాలు - వాహనాలు సముద్రంలో కొట్టుకుపోయాయి. పెద్దఎత్తున ఆస్తినష్టం సంభవించినట్లు జాతీయ విపత్తు సంస్థ అధికారులు వెల్లడించారు. క్రకటోవా అగ్నిపర్వతం విస్పోటనం కారణంగా సునామి సంభవించినట్లుగా సమాచారం. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది.

దక్షిణ సుమత్రా-పశ్చిమ జావాలోని దీవుల్లో 2018 డిసెంబర్ 22వ తేదీన రాత్రి 9.30గంటల సమయంలో అకస్మాత్తుగా సునామీ విరుచుకుపడింది. భారీ నష్టాన్ని మిగిల్చింది. ఉవ్వెత్తున ఎగిసిపడిన అలల ధాటికి తీరప్రాంతంలో ఉన్న భవనాలన్నీ దెబ్బతిన్నాయి. బీచ్‌ లు - ఇతర ప్రాంతాల్లోని నివాస సముదాయాల వద్ద ముందస్తు హెచ్చరికలు జారీ చేసే అవకాశం లేకపోయింది. సునామీ ధాటికి తీరం వెంబడి ఇళ్లన్నీ తుడిచిపెట్టుకుపోయాయని - భారీగా ఆస్తినష్టం సంభవించిందని ఇండోనేసియా విపత్తు శాఖ అధికారులు తెలిపారు. దీవులకు సమీపంలోని క్రకటోవా అగ్నిపర్వతం పేలడం వల్ల సముద్ర గర్భంలో కొండచరియలు విరిగిపడి సునామీ సంభవించి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం సహాయక బృందాలను మోహరించారు. పర్యాటకులు ఎక్కువగా ఉండే బీచ్‌పై అకస్మాత్తుగా భారీ అల ఎగిసిపడి వినాశనం సృష్టించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.