Begin typing your search above and press return to search.

భూమి.. స‌ముద్రం ఆ దేశంపై పంజా విసిరాయి!

By:  Tupaki Desk   |   1 Oct 2018 4:40 AM GMT
భూమి.. స‌ముద్రం ఆ దేశంపై పంజా విసిరాయి!
X
భూమికి కోపం వ‌స్తే వ‌ణ‌కాల్సిందే. స‌ముద్రుడికి ఆగ్ర‌హం వ‌స్తే ఇక అంతే. అలాంటిది.. ఒకేసారి భూమి.. స‌ముద్రం రెండూ ఒక్క‌సారిగా త‌మలోని మ‌రో కోణాన్ని చూపిస్తే.. విల‌యం విరుచుకుప‌డుతుంది. మ‌నిషి చిగురుటాకులా వ‌ణికిపోవాల్సిందే. వ్య‌వ‌స్థ‌ల‌న్నీ చేష్ట‌లుడిగిన‌ట్లుగా ఉండిపోతాయి. తాజాగా ఇండోనేషియాను ఒక కుదుపు కుదిపేసిన సునామీ.. భూకంపం కార‌ణంగా జ‌రిగిన న‌ష్టం ఊహ‌కు అంద‌నంత‌గా ఉంద‌ని చెబుతున్నారు.

సుల‌వేసి ద్వీపంలో చోటు చేసుకున్న భూకంపం.. సునామీ కార‌ణంగా పెద్ద పెద్ద భ‌వ‌నాలు నేల‌కొర‌గ‌టం.. పెద్ద ఎత్తున ప్రాణాలు పోయిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చినా.. ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తున్న వాస్త‌వాల‌తో అవాక్కు అయ్యే ప‌రిస్థితి. ఊహ‌కు అంద‌నంత‌గా విల‌యం చోటు చేసుకుంద‌ని చెబుతున్నారు.

తాజాగా చోటు చేసుకున్న ప్ర‌కృతి విల‌యంతో జ‌న జీవ‌నం పూర్తిగా స్తంభించిపోవ‌ట‌మే కాదు.. స‌ద‌రు ద్వీపంలో దారుణ ప‌రిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆదివారం సాయంత్రం నాటికి విడుద‌ల చేసిన అధికారిక ప్ర‌క‌ట‌న‌ల ప్ర‌కారం చూస్తే ఈ ప్ర‌కృతి విల‌యం కార‌ణంగా 832 మంది మ‌ర‌ణించిన‌ట్లుగా చెబుతున్నారు. ఇండోనేషియా ఉపాధ్య‌క్షుడు జుసుఫ్ క‌ల్లా మాటల్లో చెప్పాలంటే.. భూకంపం కార‌ణంగా చోటు చేసుకున్న మృతుల సంఖ్య వేల‌ల్లో ఉంటుంద‌ని చెబుతున్నారు. చాలామంది ఇంకా శిథిలాల కింద చిక్కుకొని ఉన్నార‌న్నారు.

దారుణ‌మైన విష‌యం ఏమంటే.. భూకంపం.. సునామీల‌తో తీవ్రంగా దెబ్బ తిన్న చాలా ప్రాంతాలకు స‌హాయ‌క బృందాలు ఇంకా చేరుకోలేదు. భారీ విల‌యం చోటు చేసుకున్న గంట‌ల త‌ర్వాత ఆదివారం సాయంత్రం ఇండోనేషియా అధ్య‌క్షుడు జోకో విడోడో బాధిత పట్ట‌ణాన్ని సంద‌ర్శించారు. బాధితుల్ని ప‌రామ‌ర్శించారు.

భూకంపం కార‌ణంగా విద్యుత్ వ్య‌వ‌స్థ స్తంభించి పోయింది. విద్యుత్ స‌ర‌ఫ‌రా లేక‌పోవ‌టంతో స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు ఆటంకం క‌లుగుతోంది. భూకంపం-సునామీ విరుచుకుప‌డిన ప్రాంతాల‌కు అవ‌స‌ర‌మైన ఆహార‌ప‌దార్థాల్ని వాయుసేన‌కు చెందిన విమానం ద్వారా చేర‌వ‌స్తున్నారు.

ఇక‌.. ఈ ప్ర‌కృతి విప‌త్తు దెబ్బ‌కు సుల‌వేసి ద్వీపంలో ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. ఇళ్లు భారీగా ధ్వంసం కావ‌టంతో ప్ర‌జ‌లు ఆక‌లి తీర్చుకునేందుకు షాపుల‌తో పాటు.. తాగునీటి ట్యాంక‌ర్ల‌ను సైతం లూటీలు చేస్తున్నారు. అంటువ్యాధుల భ‌యంతో మృత‌దేహాల‌ను అధికారులు సామూహిక ఖ‌న‌నాల‌కు చేప‌డుతున్నారు. అక్క‌డి ప‌రిస్థితుల్ని ఒక్క మాట‌లో చెప్పాలంటే.. భారీ యాక్సిడెంట్ కు గురైన కారు ఎంత‌లా ధ్వంసం తిందో సుల‌వేసి ద్వీపం ప‌రిస్థితి కూడా ఇంచుమించు అలానే ఉంది.