Begin typing your search above and press return to search.

ఆమెను పోలీసులు దారుణంగా కొట్టార‌ట‌

By:  Tupaki Desk   |   27 Jun 2017 1:06 PM GMT
ఆమెను పోలీసులు దారుణంగా కొట్టార‌ట‌
X
కుమార్తెను హత్య చేయించిన నేరం కింద జైలు శిక్ష అనుభవిస్తున్న ఇంద్రాణి ముఖర్జియా కేసు మ‌రో మ‌లుపు తిరిగింది. ప్ర‌స్తుతం ఆమె జైలు శిక్ష అనుభ‌విస్తున్న బైకుల్లా జైలులోని సిబ్బంది ఇంద్రాణిని తీవ్రంగా కొట్టినట్లు ఆమె తరపు న్యాయవాది ముంబయిలోని ప్రత్యేక సీబీఐ కోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. ఇంద్రాణిని వేధింపులకు గురి చేసినట్లు కూడా పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇంద్రాణిని తీవ్రంగా గాయపరిచారని.. ఆమె శరీరంపై మరకలు ఉన్నాయని ఆమె తరపు న్యాయవాది తెలిపారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు.. బుధవారం ఇంద్రాణిని కోర్టులో హాజరు పరచాలని జైలు సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది.

ఇదే జైలులో రెండు రోజుల క్రితం జరిగిన ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా ఖైదీ స‌ద‌రు విభాగాధిపతి మనిషా పోకార్కర్ చేతుల్లో తీవ్ర‌గాయాల పాలై ప్రాణాలు విడిచిందనే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మ‌హిళా ఖైదీని తీవ్రంగా వేధించి.. లైంగిక వేధింపులకు గురి చేశారనే ప్ర‌చారం కూడా సాగుతోంది. ఈ ఘ‌ట‌న బ‌య‌ట‌కు పొక్క‌డంతో ద‌ర్యాప్తుకు ఆదేశించిన పోలీసులు ఈ సంఘటనకు బాధ్యులను చేస్తూ ఆరుగురు జైలు అధికారులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. దాదాపు హత్య చేసినట్లుగా పోకార్కర్‌ వ్యవహరించారని, ఓ బ్యాటన్‌ తో ఆ మహిళను బయటకు చెప్పలేనంత దారుణంగా హింసించారని ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనికి సంబంధించిన మెడికల్‌ రిపోర్టు ఇంకా రావాల్సి ఉంది. ఈ క్రమంలో బైకుల్లా జైలులో దాదాపు 200మంది మహిళా ఖైదీలు ఆందోళన చేశారు. ఈ సంద‌ర్భంగా జైలులో ప‌లు ఆస్తుల‌ను ధ్వంసం చేశార‌ని వార్త‌లు తెర‌మీద‌కు వ‌చ్చాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/