Begin typing your search above and press return to search.

బీజేపీ పై అసహనంలో ఇంద్రసేనా .. అలక తీర్చుతుందా ?

By:  Tupaki Desk   |   29 Nov 2019 10:10 AM GMT
బీజేపీ పై అసహనంలో ఇంద్రసేనా .. అలక తీర్చుతుందా ?
X
ప్రజానాయకులు వేరు రాజకీయ నాయకులు వేరు. ఈ ఇద్దరి మధ్య ఉన్న తేడా ఏంటో అందరికి తెలుసు. కానీ , అందరిని రాజకీయ నేతలుగానే చూస్తాం. అయినప్పటికీ కొందరిపై ప్రజలలో ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది. ఇక రాజకీయం అంటే అనుకున్నంత ఆషామాషి ఏమి కాదు. ఏ మాత్రం కొంచెం అప్రమత్తంగా లేకపోయినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. రాజకీయంలో ఏ క్షణంలో అయిన ఓడలు బండ్లు కావొచ్చు. బండ్లు ఓడలూ కావొచ్చు. నిత్యం ప్రత్యర్థుల ఎత్తులని కనిపెడ్తూనే ఎత్తులకు పై ఎత్తులు వేయాలి. జిమ్మిక్కులూ చేయాలి. అలాగే తమ వెంట నడిచే స్నేహితులని కూడా ఒక కంట పనిపెట్టాలి.

కానీ, మనం ఇప్పుడు తెలుసుకోబోయే వ్యక్తి మాత్రం అలాంటివారు కారు. సమస్య ఏదైనా , ఎదుట ఉన్నది ఎవరైనా తన అభిప్రాయాన్ని , చెప్పాలనుకున్నదాన్ని నిర్మొహమాటంగా చెప్పగల సమర్దుడు. అదే ముక్కుసూటి తనం ఒకప్పుడు ఆయన్ని అగ్ర స్థానంలో నిలబెడితే ..ఇప్పుడు అదే ఆయనికి మైనస్ గా మారింది. అయన తెలంగాణ బీజేపీ పార్టీలో అందరి కన్నా సీనియర్. బీజేపీ పార్టీ అధ్యక్షుడిగానూ పనిచేసారు, పార్టీ ఉన్నతి కోసం అహర్నిశలు కృషి చేశారన్న పేరు తెచ్చుకున్నారు. అలాంటి నాయకుడు ప్రస్తుతం పార్టీ ఆఫీస్ కే పరిమితమయ్యారు. కానీ, పార్టీ కోసం అంత చేసిన ఆయనకు ..పార్టీ ఏమి చేయలేదు అని అయన సన్నిహితులు చెప్తున్నారు. ఇంతకీ ఎవరా నాయకుడు ? ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది ? .. అయన మరెవరో కాదు నల్లు ఇంద్ర సేనా రెడ్డి. పార్టీలో క్రమశిక్షణ గల నేతగా ఆయనికి మంచి గుర్తింపు ఉంది.

నల్లు ఇంద్ర సేనా రెడ్డి పార్టీ లో 1980 నుండే ప్రధాన పాత్ర వహిస్తున్నారు. జాతీయ స్థాయిలో పని చేసిన ఆయన, ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు. అలాగే తెలంగాణలో జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో బీజేపీ నుంచి మూడుసార్లు గెలిచిన అతికొద్ది మంది నేతలలో అయన కూడా ఒకరు. ప్రస్తుత రాష్ట్ర బీజేపీ కార్యాలయ భవనం ఇంద్రసేనా రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నిర్మించారు. ఆలా పార్టీకి అన్ని తానై నిలబడిన సీనియర్ కి ప్రస్తుతం పార్టీలో కనీస గౌరవం దక్కడం లేదు అని కొందరు తమ అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన చాలామందికి పార్టీ సముచిత స్థానం కల్పించి , ఇంద్ర సేనా రెడ్డిని కేవలం పార్టీ ఆఫీస్ కే పరిమితం చేయడం సమంజసం కాదు అని ఆయన సన్నిహితులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముక్కు సూటితనం, నిక్కచ్చిగా ఉండటంతో పార్టీలో ఎదగలేకపోయారని చెప్తున్నారు. అలాగే మరోవైపు ఇంద్రసేనారెడ్డి గవర్నర్ పదవి ఆశిస్తున్నట్లు సమాచారం. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రాల్లో అధికారంలో లేని సమయంలో పార్టీ బలోపేతానికి తాను చేసిన కృషిని మోడీ, అమిత్ షాలు గుర్తిస్తారన్న నమ్మకం తనకుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారట ఇంద్రసేనా రెడ్డి. ఎంతోమంది అద్యక్షులకి గవర్నర్లుగా ప్రమోషన్లు ఇచ్చిన బీజేపీ పార్టీ ..తమ నేత కి కూడా ఒక అవకాశం ఇస్తుందని అయన అనుచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.