Begin typing your search above and press return to search.

సుప్రీం జ‌డ్జి కానున్న ఇందూలో ప్ర‌త్యేక‌త‌లెన్నో..!

By:  Tupaki Desk   |   27 April 2018 4:30 AM GMT
సుప్రీం జ‌డ్జి కానున్న ఇందూలో ప్ర‌త్యేక‌త‌లెన్నో..!
X
61 ఏళ్ల ఇందూ మ‌ల్హోత్రా పేరు ఈ మ‌ధ్య‌న మీడియాలో త‌ర‌చూ వినిపిస్తూ.. క‌నిపిస్తోంది. ఇంత‌కీ ఎవ‌రు ఆమె? ఆమె ప్ర‌త్యేక ఏమిటి? ఒక మ‌హిళా న్యాయ‌వాది నేరుగా సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా ఎందుకు కాబోతున్నారు? తొలిసారి ఇలాంటి అరుదైన అవ‌కాశం ఆమెకు మాత్రమే ఎందుకు సొంతం అవుతోంది? ఇంత‌కీ.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అంద‌రికి న్యాయ‌వాదిగా ప‌రిచ‌యం ఉన్న ఆమెకు సంబంధించిన విశేషాలు చూస్తే ఆస‌క్తిక‌రంగానే కాదు.. సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి ప‌ద‌వికి నూటికి నూరుశాతం అర్హురాల‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.

కొలీజియం సిఫార్సుల ఆధారంగా రాష్ట్రప‌తి కోవింద్ తాజాగా వెలువ‌రించిన ఉత్త‌ర్వుల ప్ర‌కారం ఇందూ సుప్రీం న్యాయ‌మూర్తిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు. సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ దీప‌క్ మిశ్రా ఇందూ చేత ప్ర‌మాణ‌స్వీకారం చేయించ‌నున్నారు.

స్వాతంత్య్రం త‌ర్వాత ఇప్ప‌టివ‌ర‌కూ సుప్రీంకోర్టులో ఆరుగురు మ‌హిళా న్యాయ‌మూర్తులు రాగా.. వారంతా హైకోర్టులో జడ్జిలుగా అనుభ‌వం ఉన్న‌వారు. దీనికి భిన్నంగా ఇందూ మాత్రం న్యాయ‌వాది నుంచి నేరుగా న్యాయ‌మూర్తి కావ‌టం విశేషంగా చెప్పాలి. న్యాయ‌వాదిగా కాకుండా ఇందూ ఒక ఉద్య‌మ‌కారిణి. స్వ‌యంగా ఆమె ప‌లు అంశాల మీద పోరాటం చేస్తుండ‌టం విశేషం.

న్యాయ‌వాదుల కుటుంబంలో పుట్టిన ఇందూ బెంగ‌ళూరుకు చెందిన వారైనా.. ఆమె చ‌దువు మాత్రం ఢిల్లీలోనే సాగింది. 1988లొ అడ్వ‌కేట్ ఆన్ రికార్డ్ ప‌రీక్ష‌లో ఫ‌స్ట్ ర్యాంక‌ర్ గా నిలిచారు.క్లిష్టంగా ఉంటుంద‌న్న ఈ ప‌రీక్ష‌లో టాప‌ర్ గా నిల‌వ‌టం సామాన్య‌మైన విష‌యం కాదు. 2007లో సీనియ‌ర్ న్యాయ‌వాదిగా వ్య‌వ‌హ‌రించిన ఆమె.. సినిమా ఇండ‌స్ట్రీలో మ‌హిళా మేక‌ప్ క‌ళాకారుల ప‌ట్ల ఉండే వివ‌క్ష‌పై జ‌రిగిన పోరాటంలో ఆమె న్యాయ‌వాదిగా సేవ‌లు అందించారు. వ‌ర‌క‌ట్న కేసుల్లో అరెస్టుల‌పై సుప్రీంకు ఆమె న్యాయ స‌హాయ‌కురాలిగా వ్య‌వ‌హ‌రించారు. ఇలా ప‌లు అంశాల్లో కీల‌క‌భూమిక పోషించిన ఆమె.. సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు.