Begin typing your search above and press return to search.

రాచబాటన రాచకొండ

By:  Tupaki Desk   |   29 Jun 2015 9:07 AM GMT
రాచబాటన రాచకొండ
X
నల్లగొండ జిల్లా రాచకొండలో ఫిల్మ్‌, స్పోర్ట్స్‌ సిటీలు నిర్మించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గతంలో ప్రకటించారు.. ఆయన హెలికాప్టర్‌ లో ఏరియల్‌ సర్వేలూ చేశారు. రాచకొండలోని 31 వేల ఎకరాల భూమిలో పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలు, సంస్థలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణకు తలమానికంగా నిలిచే సంస్థలను ఇక్కడ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఇప్పుడు రాచకొండ నిజంగానే తెలంగాణకు తలమానికంగా నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పిన మాటలు నిజమయ్యే రోజులు సమీపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానం పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను రాచకొండవైపు నడిపిస్తోంది. ఇది పరిశ్రమల ఏర్పాటుకు అనువైన ప్రాంతంగా భావిస్తుండడమే దీనికి కారణం.

నల్గండ, రంగారెడ్డి, మహబూబ్‌ నగర్‌ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న రాచకొండ అటవీప్రాంతంలో సుమారు 40 వేల ఎకరాలున్నట్లు అంచనా. ఇది శంషాబాద్‌ విమానాశ్రయానికి 25 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉండడం మరో అనుకూలత. అవుటర్‌ రింగ్‌ రోడ్డుకూ సమీపంలోనే ఉంది. రాచకొండలో ఇప్పటికే ఫిల్మ్‌ సిటీ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం 2 వేల ఎకరాలు కేటాయించాలని నిర్ణయించింది. మరో రెండు వేల ఎకరాల్లో స్మార్ట్‌ సిటీ నిర్మించాలని భావిస్తున్నారు. రుయా గ్రూప్‌ ఇక్కడ రైలు బోగీల పరిశ్రమ నెలకొల్పే యోచనలో ఉంది. వీటితో పాటు క్రీడారంగ, విద్యారంగ సంస్థలూ ఏర్పాటుకావొచ్చు. సుమారు 80 వేల కోట్ల పెట్టుబడులకు తగిన అంచనాలు ప్రభుత్వం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

రాచకొండపై పారిశ్రామికివేత్తలు ఆసక్తిగా ఉండడంతో ఇక్కడ సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు నుంచి ఇక్కడు నాలుగు లేన్ల రోడ్లు వేయనున్నారు. అంతేకాదు.... మెదక్‌, విజయవాడ, వరంగల్‌, కరీంనగర్‌ రోడ్లను దీనికి కలుపుతూ రింగురోడ్డు నిర్మించాలనుకుంటున్నారు. మొత్తానికి రాచకొండ అభివృద్ధికి రాచబాట పడుతోందనడంలో ఎలాంటి అనుమానం లేదు.