Begin typing your search above and press return to search.

మహిళలంటే బ్రాహ్మణి, కవిత, దీపావెంకటేనా?

By:  Tupaki Desk   |   12 Feb 2017 7:13 AM GMT
మహిళలంటే బ్రాహ్మణి, కవిత, దీపావెంకటేనా?
X
ఏపీలో జరుగుతున్న నేషనల్ ఉమెన్ పార్లమెంటు సాక్షిగా చంద్రబాబు వాయిస్తున్న సొంత డబ్బాపై అంతటా విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మహిళా సాధికారత విషయంలో స్ఫూర్తిదాయకమైన గొప్ప మహిళలు ఎందరో సదస్సుకు రాగా వారందరినీ కాదని.. చంద్రబాబు కోడలు బ్రాహ్మణి, కేసీఆర్ కుమార్తె కవిత, వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్ కే పెద్ద పీట వేసి వారు తప్ప ఇంకెవరూ మహిళలు లేరన్నట్లుగా చూడడం పై విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు.. ఆ ముగ్గురు కూడా మా నాన్న, మా తాత, మా మామ అంటూ సొంత డబ్బాలు కొట్టుకోవడంతో కోట్లు పోసి నిర్వహిస్తున్న ఈ సదస్సు చంద్రబాబు కోసమా అని ప్రశ్నిస్తున్నారు.

సమాచారహక్కు కమిషనర్‌ విజయ్‌బాబు కూడా దీనిపై నిప్పులు చెరిగారు. మహిళల పట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆయన ఆవేదన చెందారు. మహిళా సదస్సులో చంద్రబాబు, స్పీకర్ కోడెల పెత్తనాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. మహిళా సదస్సుల్లో మగవాళ్ల పెత్తనం ఏమిటన్నారు.

ప్రభుత్వం ఫండ్స్ విడుదల చేసి సదస్సును సొంతంగా నిర్వహించుకునే అవకాశం మహిళలకు ఇవ్వాల్సిందన్నారు. అలా చేయకుండా మహిళలకు తాము సపోర్టు చేస్తున్నామని చెప్పుకోవడానికి వీరేమైనా స్వర్గం నుంచి దిగి వచ్చారా అని ప్రశ్నించారు. మహిళల తరపున పోరాటం చేస్తున్న వారు, బాధితులైన మహిళలు ఎంతో మంది ఉన్నారని, కానీ వారికి సదస్సులో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా నారా బ్రహ్మణి, వెంకయ్యనాయుడు కుమార్తె, కేసీఆర్‌ కుమార్తెలతోనే మాట్లాడించడం ఏమిటని విజయ్‌బాబు ప్రశ్నించారు. కవిత మాట్లాడాలంటే లోక్‌సభ ఉందని, బ్రహ్మణి మాట్లాడాలంటే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉందని, వెంకయ్య కుమార్తె కోసం స్వర్ణభారతి ట్రస్ట్ ఉందని.. కనీసం మహిళా సదస్సులోనైనా సామాన్య మహిళలకు అవకాశం ఇస్తారనుకుంటే అది కూడా చేయలేదని ఆయన ఆవేదన చెందారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు కోడలు తనకు అత్తమామలు, భర్త చేసిన అన్యాయంపై కన్నీటి పర్యంతమైన వీడియోను తాను చూశానని దాన్ని చూసిన తర్వాత చాలా బాధేసిందన్నారు. మహిళా సదస్సును మగవాళ్లు నిర్వహిస్తున్నారో లేక దుశ్సాసన ప్రతినిధులు నిర్వహిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు విజయబాబు.