Begin typing your search above and press return to search.

ఐటీ శాఖకు మొట్టికాయ వేసిన ‘హైకోర్టు’

By:  Tupaki Desk   |   2 Aug 2016 8:23 AM GMT
ఐటీ శాఖకు మొట్టికాయ వేసిన ‘హైకోర్టు’
X
రీల్ లైఫ్ లో చెప్పే నీతులన్ని రియల్ లైఫ్ లో ఏ మాత్రం పాటించని సెలబ్రిటీలు కొత్తేం కాదు. చట్టప్రకారం చెల్లించాల్సిన ఆదాయపన్నును ఎగవేతకు పాల్పడటం చాలామంది సెలబ్రిటీలకు మామూలే. ఇలా పన్ను ఎగ్గొట్టే సెలబ్రిటీల గుట్టు రట్టు చేసి.. వారికి సంబంధించిన కీలక సమాచారాన్ని అందించిన ఒక ఇన్ ఫార్మర్ విషయంలో ఐటీ శాఖ అనుసరించిన వైనాన్ని ముంబయి హైకోర్టు తప్పు పట్టటమేకాదు.. ఆయనకు న్యాయసమ్మతంగా చెల్లించాల్సిన రూ.5కోట్లను వెంటనే చెల్లించాలని చెప్పింది.

బాలీవుడ్ ప్రముఖులైన రాణిముఖర్జీ.. శేఖర్ సుమన్.. లాంటి 16 మందికి సంబంధించిన ఐటీ ఎగవేత బండారాన్ని ఆధారాలతో సహా ఐటీ శాఖకు ఒక వ్యక్తి అందించారు. ఐటీ శాఖ వెల్లడించిన ఒక ఆఫర్ ఏమిటంటే.. ఐటీ శాఖకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఎగవేతకు పాల్పడే వారికి సంబంధించిన సమాచారాన్ని ఆధారాలతో ఇచ్చినపక్షంలో.. సదరు వ్యక్తుల నుంచి వసూలు చేసే పన్ను మొత్తంలో 7.5 శాతం నుంచి 10 శాతం మొత్తాన్ని రివార్డురూపంలో ఇస్తామని పేర్కొంది.

ఈ ప్రకటనతో ముంబయికి చెందిన ఒక వ్యక్తి బాలీవుడ్ ప్రముఖులకు చెందిన సమాచారాన్ని ఐటీ శాఖకు అందించారు. ఈ ఇన్ ఫార్మర్ అందించిన సమాచారంతో ఐటీ శాఖ రూ.50 కోట్ల మేరకు పైగా మొత్తాన్ని సదరు ప్రముఖుల నుంచి వసూలు చేసింది. అదే సమయంలో.. తాము చెప్పినట్లుగా ఇన్ ఫార్మర్ కు ఇవ్వాల్సిన రివార్డు మొత్తాన్ని ఇవ్వలేదు. ఈ విషయమై సదరు ఇన్ ఫార్మర్ ఎంతప్రయత్నించినా ఐటీ శాఖ రివార్డు సొమ్మును ఇవ్వకపోవటంతో.. తనకు రావాల్సిన మొత్తంపై ముంబయి హైకోర్టును సదరు ఇన్ ఫార్మర్ ఆశ్రయించారు. దీంతో.. ఈ కేసును విచారించిన హైకోర్టు సదరు ఇన్ ఫార్మర్ కు ఇస్తానని చెప్పిన మొత్తాన్ని చెల్లించాలని తీర్పు ఇచ్చింది. తాజా తీర్పుతో ఐటీ శాఖ సదరు ఇన్ ఫార్మర్ కు రూ.5కోట్ల మొత్తాన్ని ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పీనాసి వైఖరితో ఐటీ శాఖ వ్యవహరిస్తే.. ఆ శాఖను నమ్మి సమాచారాన్ని ఎవరూ ఇవ్వరు కదా..? ఆ విషయాన్ని ఐటీ శాఖ ఎందుకు గుర్తించదు? తప్పు చేసినోళ్ల చెవి మెలేసే ఐటీశాఖనే తనకు తాను తప్పు చేస్తే ఎలా?