Begin typing your search above and press return to search.

వర్క్ ఫ్రం హోంపై ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం

By:  Tupaki Desk   |   14 Oct 2022 11:30 PM GMT
వర్క్ ఫ్రం హోంపై ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం
X
వర్క్ ఫ్రం హోం.. ప్రపంచాన్ని కరోనా కాటేయడంతో ఇంటినుంచే కంపెనీలన్నీ పనిచేయించడం ప్రారంభించాయి. ఉద్యోగులకు ఈ వెసులుబాటు కల్పించి వారి ప్రాణాలకు రక్షణ కల్పించింది. కానీ ఇప్పుడు ఇదే ఉద్యోగులకు వరమైంది. కంపెనీలకు చాలా నిర్వహణ ఖర్చులను మిగిల్చింది. సో వర్క్ ఫ్రం హోంను వదలడానికి ఉద్యోగులు ఇష్టపడడం లేదు. కొందరు ఇంటివద్దే రెండు జాబ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.

ఈ క్రమంలోనే టాప్ కంపెనీలన్నీ ఉద్యోగులను ఆఫీసులకు రావాలంటూ హుకూం జారీ చేస్తున్నాయి. దేశంలోనే టాప్ ఐటీ కంపెనీ అయిన ‘ఇన్ఫోసిస్’ కూడా వర్క్ ఫ్రం హోంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడిప్పుడే ఉద్యోగులు ఆఫీసుకు రావడాన్ని తప్పనిసరి చేయబోమని సీఈవో సలీల్ పరేఖ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తాము అవలంబిస్తున్న హైబ్రిడ్ పని విధానం కొనసాగిస్తామన్నారు. కొద్దిరోజులు ఇంటి నుంచి.. మరికొన్ని రోజులు ఆఫీసు నుంచి పని చేయడానికి చూస్తామన్నారు. దీన్ని మరింత కాలం కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు.ఖచ్చితంగా ఇన్ని రోజులు ఆఫీసులకు రావాలని కూడా నియమం పెట్టబోమన్నారు.

ఇంటి నుంచి పనివిధానం పై ఇప్పటివరకూ కంపెనీ తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగుల స్పందన కూడా బాగుందని తెలిపారు. కొన్ని సందర్భాల్లో క్లయిట్ల అవసరానికి అనుగుణంగా ఉద్యోగులు నడుచుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 50వేల మంది ఫ్రెషర్లకు నియమించుకుంటామని గతంలోనే ఇన్ఫోసిస్ ప్రకటించింది. ఇందులో తొలి 6 నెలల్లోనే 40వేల నియామకాలను పూర్తి చేసింది. సెప్టెంబర్ త్రైమాసికంలో నికరంగా ఉద్యోగుల సంఖ్య 10032కు పెరిగింది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 3,45,218కు చేరింది. వలసల రేటు 27.1 శాతానికి తగ్గింది.

ఇక మూన్ లైటింగ్ అంటూ ఒకేసారి రెండు కంపెనీలకు ఉద్యోగాలు చేయడాన్ని ఇన్ఫోసిస్ వ్యతిరేకిస్తోంది. ఇలా చేస్తున్న కొంతమందిని గుర్తించి గత 12 నెలల్లో తొలగించింది. కొత్త టెక్నాలజీని నేర్చుకొని మెరుగైన సాలరీలు పొందాలని సూచిస్తోంది. ‘యాక్సలరేట్’ పేరుతో ఫ్లాట్ ఫామ్ ఏర్పాటు చేసినట్లు చెబుతోంది.

మొత్తంగా ఉద్యోగులు మానేస్తారన్న భయం.. నాణ్యమైన మానవ వనరుల కొరత వస్తుందని భావించిన ఇన్ఫోసిస్ ఇప్పుడప్పుడే ఆఫీసు నుంచి పని విధానాన్ని అమలు చేయడానికి జంకుతోంది. ఎంత కాలం దీన్ని కొనసాగిస్తుందో చూడాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.