Begin typing your search above and press return to search.

ఇంటి నుంచి పని వద్దు.. ఇన్ఫోసిస్ నారాయణ కీలక వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   14 March 2022 3:46 AM GMT
ఇంటి నుంచి పని వద్దు.. ఇన్ఫోసిస్ నారాయణ కీలక వ్యాఖ్యలు
X
ఇంటి నుంచి పని (వర్కు ఫ్రం హోం) అన్నది కొత్త కాన్సెప్టు కానప్పటికీ.. కరోనా పుణ్యమా అని.. ఐటీ ఉద్యోగులందరిని ఇంటి నుంచి పని చేసే విధానాన్ని తప్పనిసరి చేయటం తెలిసిందే. కొవిడ్ సంక్షోభంతో ఇంటి నుంచి పని చేసే విధానంతో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయన్న సందేహాలకు చెక్ పెట్టేలా ఐటీ ఉద్యోగుల పని తీరు ఉండటం.. ఉత్పాదకత గతానికి కంటే ఎక్కువగా ఉండటం తెలిసిందే. దీంతో.. వర్కు ఫ్రం హోం విధానాన్ని కొనసాగించేందుకు ఐటీ కంపెనీలు మొగ్గు చూపాయి.

కొవిడ్ కారణంగా గడిచిన రెండేళ్లుగా వర్కు ఫ్రం హోం విధానాన్ని అమలు చేస్తున్న ఐటీ కంపెనీలు.. ఇప్పుడు కొవిడ్ పూర్తిగా తగ్గిపోయిన నేపథ్యంలో మళ్లీ ఆఫీసుకు రావాలన్న మాట అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం.. ఐటీ ఉద్యోగులు ఇంటిని వదిలి ఆఫీసుకు వచ్చేయాలన్న మాటను తరచూ చెబుతున్నారు.

కొన్ని కంపెనీలు ఇంటి నుంచి పని చేసే విధానానికి చెల్లుచీటి ఇచ్చేసి.. ఆఫీసుకు వచ్చేయాలని చెబుతుంటే.. చాలా కంపెనీలు ఇప్పటికి వర్కు ఫ్రం హోంను ఫాలో అవుతున్నాయి.

ఇలాంటి వేళ.. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ఉద్యోగుల్ని ఆఫీసులకు వచ్చేలా ఐటీ కంపెనీలు ప్రోత్సహించాలని ఆయన కోరుతున్నారు. కరోనా తగ్గిపోయిందని.. తీవ్రత లేనందున ఉద్యోగుల్ని ఇంటి నుంచి పని చేయించే విధానాన్ని పక్కన పెట్టేసి.. ఆఫీసుకు రావాలని చెప్పాలంటున్నారు. తాను ఇంటి నుంచి పని చేసే విధానానికి అభిమానిని కాదన్న ఆయన.. బెంగళూరులో జరుగుతున్న ఐటీ సమ్మిట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు.

వర్కు ఫ్రం హోం విధానం తనకు ఇష్టం ఉండదన్న ఆయన.. ఇంటి నుంచి పని చేస్తే క్రియేటివిటీకి సాధ్యం కాదన్నారు. పనిలోనూ నాణ్యత ఉండదన్న ఆయన..ఐటీ ఉద్యోగులు ఇంటికే పరిమితం కావటం వల్ల.. కంపెనీ సంస్థాగత వ్యవహారాలు నెమ్మదిస్తున్నట్లుగా చెబుతున్నారు.

మరి.. ఇన్ఫోసిస్ పెద్దాయన మాటలకు ఐటీ కంపెనీలు ఎలా రియాక్టు అవుతాయి? గడిచిన రెండేళ్లుగా ఇంటి నుంచి పని చేసే విధానానికి అలవాటు పడిన ఉద్యోగులు.. మళ్లీ ఉరుకులు పరుగులు.. రద్దీ రహదారుల్లో ట్రాఫిక్ జాంలను దాటుకుంటూ ప్రయాణించి ఆఫీసులకు వెళ్లేందుకు ఎంత మేర ఆసక్తి చూపిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారిందని చెప్పక తప్పదు.