Begin typing your search above and press return to search.

రిషి సునక్ ఎన్నికపై ఆయన మామ, ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి స్పందన

By:  Tupaki Desk   |   25 Oct 2022 9:02 AM GMT
రిషి సునక్ ఎన్నికపై ఆయన మామ, ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి స్పందన
X
భారత సంతతికి చెందిన రిషి సునక్ యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నాడు. మనల్ని పాలించిన వారిని పాలిస్తూ ఒక కొత్త చరిత్రను లిఖిస్తున్నాడు.. సోమవారం మధ్యాహ్నం నుంచి దేశంలోని నలుమూలల నుంచి రిషికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తికి రిషి సునక్ స్వయానా అల్లుడు అని మనకు తెలిసిందే. నారాయణమూర్తి కూతురు అక్షితను రిషి పెళ్లి చేసుకున్నాడు. ఈ టెక్ బాస్ తన అల్లుడు రిషి బ్రిటన్ ప్రధాని కావడంపై స్పందించాడు. "రిషికి అభినందనలు. మేము అతనిని చూసి గర్విస్తున్నాము. అతని విజయాన్ని కోరుకుంటున్నాము. అతను యునైటెడ్ కింగ్‌డమ్ ప్రజల కోసం తన వంతు కృషి చేస్తాడని మేము విశ్వసిస్తున్నాము,"అని నారాయణ మూర్తి ఏఎన్ఐతో మాట్లాడుతూ అన్నారు.

మూర్తి భార్య , రచయిత్రి అయిన సుధా మూర్తి కూడా తన అల్లుడు రిషి సునక్‌కి శుభాకాంక్షలు తెలిపారు. "అభినందనలు రిషి," అని సుధ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో రాసింది.

రిషి ఆక్స్‌ఫర్డ్ ,స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయాల పూర్వ విద్యార్థి. అతను స్టాన్‌ఫోర్డ్‌లో అక్షతా మూర్తి క్లాస్ మేట్. ఆమెను చూసి ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రుల ఆమోదంతో రిషి, అక్షత పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు మూర్తి కుటుంబాన్ని కలవడానికి తరచుగా బెంగళూరుకు వస్తుంటారు.

ఇంగ్లండ్ లోని సౌథాంప్టన్ నగరంలో రిషి 1980 మే 12న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఉష, యశ్ వీర్. భారత్ లోని పంజాబ్ లో రిషిసునాక్ తల్లిదండ్రుల మూలాలున్నాయి. వారు టాంజానియా, కెన్యా నుంచి బ్రిటన్ కు వలసవచ్చారు. సునాక్ తండ్రి యశ్ వీర్ వైద్యులు కాగా.. తల్లి మెడికల్ షాప్ నిర్వహించేవారు.

ఆక్స్ ఫర్డ్ లో ఫిలాసఫీ, ఎకనామిక్స్ అభ్యసించారు. మన భారత ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షతా మూర్తిని రిషి సునాక్ వివాహం చేసుకున్నారు. 2009లో వీరికి పెళ్లి అయ్యింది. ఇద్దరు కుమార్తెలున్నారు.

తొలిసారి 2015లో రిచ్ మండ్ ఎంపీగా రిషి సునాక్ ఎన్నికయ్యారు. 2017, 2019లలోనూ తిరిగి ఎన్నికయ్యారు. 2020 ఫిబ్రవరిలో బోరిస్ జాన్సన్ కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా నియమితులై ఈ ఏడాది జులై వరకూ కొనసాగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా భారత సంతతి రిషి బ్రిటన్ ప్రధాని కావడంతో దేశంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.