Begin typing your search above and press return to search.

ఇక.. ‘‘వరంగల్’’కు ఐటీ లుక్

By:  Tupaki Desk   |   14 Feb 2016 4:59 AM GMT
ఇక.. ‘‘వరంగల్’’కు ఐటీ లుక్
X
చారిత్రక ఓరుగల్లుకు టెక్కీ లుక్ రానుంది. ఇప్పటివరకూ వరంగల్ అంటే ఉద్యమాల ఖిల్లాగా ఉన్న పేరు ప్రఖ్యాతుల స్థానే.. ఇకపై ఐటీ లుక్ యాడ్ కానుంది. దేశీయ ఐటీ పరిశ్రమకు సంబంధించి హైదరాబాద్ ఎంతటి ప్రాధాన్యం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణలో ఐటీ ఒక్క హైదరాబాద్ కే పరిమితం చేయకుండా.. మరో మహా పట్టణంలోనూ ఐటీని అభివృద్ధి చేసేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం తాజాగా కసరత్తు మొదలు పెట్టటమే కాదు.. మరో ఐదు రోజుల్లో ఆ దిశగా ఒక పెద్ద అడుగు ముందుకు పడనుంది.

భారతీయ ఐటీకి సిలికాన్ వ్యాలీగా పేరొందిన కర్ణాటకలోని బెంగళూరు మహా నగరంతో పాటు.. ఐటీని మరింతగా ఆ రాష్ట్రంలో వ్యాప్తి చెందేలా చేయటం కోసం మైసూర్ ను ఎలా అయితే.. ఉపయోగిస్తున్నారో.. అదే రీతిలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తో పాటు.. ఐటీకి వరంగల్ ను మరో కేంద్రంగా తయారు చేసే ప్రయత్నంలో తొలి అడుగు మరికొద్దిరోజుల్లో పడనుంది.

వరంగల్ పరిధిలోని మడికొండలో ప్రఖ్యాత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ భారీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. తన సంస్థలో పని చేసే ఉద్యోగులకు అవసరమైన శిక్షణను ఇచ్చేందుకు వీలుగా వరంగల్ లో శిక్షణా కేంద్రాన్ని షురూ చేయనున్నారు. దీని శంకుస్థాపన కార్యక్రమాన్ని ఫిబ్రవరి 19న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టనున్నారు. వేలాది మంది శిక్షణ పొందేలా ఇన్ఫోసిస్ శిక్షణ కార్యాలయం ఉంటుందని చెబుతున్నారు.

వరంగల్ లో ఏర్పాటు చేసే కేంద్రం ఇంచుమించు.. కర్ణాటకలోని మైసూర్ క్యాంపస్ ను పోలి ఉంటుందని చెబుతున్నారు. దాదాపు 350 ఎకరాల్లో ఉన్న మైసూర్ క్యాంపస్ గురించి ఇన్ఫోసిస్ ఉద్యోగులుతరచూ చెబుతుంటారు. ఒక చిన్నసైజు నగరాన్ని పోలి ఉండే మైసూర్ ఇన్ఫోసిస్ క్యాంపస్ లో రెండు వేల గదులతో పాటు.. మల్టీ ఫ్లెక్స్.. స్విమ్మింగ్ ఫూల్.. భారీ పుడ్ కోర్టును సంస్థ ఏర్పాటు చేసింది. ఇలాంటి ఏర్పాట్లు అన్నీ వరంగల్ క్యాంపస్ లోనూ ఉంటాయని చెబుతున్నారు.

వరంగల్ పట్టణం.. చెన్నై.. న్యూఢిల్లీ రైలు మార్గం మీద ఉండటం.. హైదరాబాద్ తో పోలిస్తే.. తక్కువ ఖర్చుకావటం.. ప్రకృతి విపత్తులు తక్కువగా ఉండే అవకాశం ఉండటం లాంటి కారణాలు వరంగల్ లో తన తాజా శిక్షణ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని ఇన్ఫోసిస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం వెనుక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ కూడా ఉందన్న మాట వినిపిస్తోంది.