Begin typing your search above and press return to search.

ఆ ప్రేమ పిశాచిని చంపారా? చచ్చాడా?

By:  Tupaki Desk   |   19 Sep 2016 7:43 AM GMT
ఆ ప్రేమ పిశాచిని చంపారా? చచ్చాడా?
X
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని స్వాతి హత్య ఉదంతం తెలిసిందే. ప్రేమించానంటూ వెంటపడి.. వేధించిన ప్రేమపిశాచి రామ్ కుమార్ జైల్లో ఆత్మహత్య చేసుకోవటం సంచలనంగా మారింది. చెన్నైలోని లోకల్ స్టేషన్లో ట్రైన్ కోసం ఎదురుచూస్తున్న స్వాతిని కత్తితో దారుణంగా పొడిచి చంపేయటం తెలిసిందే. అనంతరం సొంతూరుకు పారిపోయిన రామ్ కుమార్ ను తమిళనాడు పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకోవటం.. ఈ సందర్భంగా గొంతు కోసుకొని చనిపోయే ప్రయత్నం చేసినట్లుగా వార్తలు వచ్చాయి.

పోలీసుల అదుపులో ఉన్న రామ్ కుమార్.. పుళల్ సెంట్రల్ జైల్లో ఉంటున్నాడు. ఇదిలా ఉంటే.. అతగాడు ఆత్మహత్య చేసుకోవటం సంచలనంగా మారింది. జైలు వంట గది దగ్గర విద్యుత్ తీగల్ని కొరికి ఆత్మహత్య చేసుకున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. స్వాతి హత్య కేసులో జూడిషియల్ కస్టడీలో ఉన్న రామ్ కుమార్.. ఆదివారం జైలు వంట గది వద్దకు వచ్చాడని.. అక్కడి వైరును నోటితో కొరికాడని.. దీంతో షాక్ కు గురైన రామ్ కుమార్ మరణించినట్లుగా పోలీసులు చెబుతున్నారు.

జైల్లోని కరెంటు వైరును కొరికి.. ఆత్మహత్య చేసుకున్నాడంటూ వినిపిస్తున్న కథనంపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తమ కొడుకును పోలీసులే హత్య చేసినట్లుగా రామ్ కుమార్ తండ్రి పరమశివం ఆరోపిస్తున్నారు. తన కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడుకాదని చెబుతున్నారు. పోలీసులు అరెస్ట్ చేసే సందర్భంలోనూ తన కొడుకు గొంతు కోసుకోలేదని.. పోలీసులే కోసినట్లుగా ఆరోపించటం గమనార్హం.

తన కొడుకు ఆరోగ్యం విషమంగా ఉన్నట్లుగా జైలు అదికారులు తొలుత సమాచారం అందించారని.. కాసేపటికే.. చనిపోయినట్లుగా సమాచారం అందించినట్లు రామ్ కుమార్ తండ్రి చెబుతున్నారు. తన కుమారుడి మృతిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. రామ్ కుమార్ లాయర్ రామ్ రాజ్ మాట్లాడుతూ.. తాను శనివారం కలిసిన సందర్భంలోనూ తాను తప్పు చేయలేదని.. తాను హంతకుడ్ని కాదని రామ్ కుమార్ పదే పదే చెప్పారని.. ఎప్పటిమాదిరే మాట్లాడినట్లుగా వెల్లడించారు. వంటగదిలోని కరెంటు వైరు తుంచి ఆత్మహత్య చేసుకున్నారన్న కథనంపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రామ్ కుమార్ ను అధికారులే చంపారా? లేక.. నిజంగానే ఆత్మహత్య చేసుకున్నారా? అన్నది తేలాల్సి ఉంది.