Begin typing your search above and press return to search.

ఆదివాసుల్ని అడవులకు దూరం చేస్తూ.. అడుగడుగునా అన్యాయం

By:  Tupaki Desk   |   9 Aug 2020 2:30 AM GMT
ఆదివాసుల్ని అడవులకు దూరం చేస్తూ.. అడుగడుగునా అన్యాయం
X
ఆదివాసులకు, అడవులకు విడదీయలేని సంబంధం ఉంది. అడవులను సంరక్షించడంతోపాటు వాటినే నమ్ముకొని జీవించే అడవిబిడ్డలకు మాత్రం ఎన్నో విధాలుగా న్యాయం జరగడం లేదు. ఆనకట్టలు కట్టినా, అడవుల పెంపకమైనా, గనుల తవ్వకానికైనా.. దేనికైనా ఆదివాసులు నష్టపోవాల్సిందే. దేశం అభివృద్ధి చెందాలంటే దశాబ్దాలుగా పేదలే త్యాగాలు చేయాల్సిన పరిస్థితులు అనే వాదనలు ఉన్నాయి. ఆ విషయానికి వస్తే ప్రతి అడవిబిడ్డ పేదనే. ఎన్నో ఉద్యమాలు, పోరాటాల తర్వాత 2006లో ఆదివాసుల హక్కుల రక్షణ కోసం అటవీ హక్కుల గుర్తింపు చట్టం వచ్చింది. కానీ అమలులో మాత్రం చిత్తశుద్ధి లేదనేది ఆదివాసుల ఆవేదన.. ఆందోళన.

ఈ చట్టం ప్రకారం ఆదివాసులు సాగుచేసుకునే భూములు, వారి నివాసహక్కులు చట్టపరంగా గుర్తించాలి. చట్టం వచ్చి ఇన్నేళ్లైనా వారి పరిస్థితి మెరుగుపడలేదు. పైగా ఈ చట్టం వచ్చిన తర్వాత పర్యావరణవాదులు, అటవీ సంరక్షణవాదులు.. అడవిని ఆదివాసులకే పంచేస్తే వన్యప్రాణులకు ముప్పు వాటిల్లుతుందని సుప్రీం కోర్టును ఆశ్రయించడం గమనార్హం. ఈ తీర్పు ఆదివాసులకు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ ఆ తర్వాత తాత్కాలికంగా వాయిదా వేశారు. కోర్టులో కొంతలో కొంత ఊరట లభించినప్పటికీ క్షేత్రస్థాయిలో వేధింపులు మాత్రం ఉన్నాయి.

కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం 2018 నవంబర్ నాటికి అటవీ హక్కుల కోసం తెలంగాణలో పెట్టుకున్న 44 శాతం దరఖాస్తులు, ఏపీలో 42 శాతం దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి. సుప్రీం కోర్టు తీర్పు అమలు చేస్తే వీరంతా అడవుల నుండి బయటకు వచ్చే పరిస్థితి. దరఖాస్తులు ఎందుకు తిరస్కరించారో రాతపూర్వకంగా పేర్కొనాలి. అలా చేస్తే మళ్లీ అర్జీ పెట్టుకోవడానికి వీలుంది. కానీ అది జరగడం లేదని ఆదీవాసీ, రైతు హక్కుల నాయకులు ఆందోళన చెందుతున్నారు. అలా అర్జీ చేసుకున్న వారికీ పట్టాలు సరిగా ఇచ్చింది లేదు. రెండు ఎకరాలు పెట్టుకుంటే 50 సెంట్లతో చేతులు దులుపుకున్న సందర్భాలు ఉన్నాయని అంటున్నారు.

అటవీ హక్కు పత్రాలన్నింటిని ఆన్ లైన్ భూరికార్డుల్లో చేర్చకపోవడం చాలామంది పట్టాదారులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు రాలేదు. దీంతో ప్రభుత్వాలు ఇచ్చే రైతు బంధు, రైతు భరోసా వంటి సాయాన్ని కూడా వారు పొందలేకపోతున్నారు. శతాబ్దాలు, దశాబ్దాలుగా భూములు సాగు చేసుకుంటున్నప్పటికీ.. కేవలం పట్టాలు లేవనే కారణందా ఆదివాసులను వెళ్లగొట్టే పరిస్థితులు చోటు చేసుకున్నాయి. చెట్లను పెంచాల్సిందే.. కానీ పచ్చదనం పేరుతో ఆదివాసుల బతుకుదెరువును బలితీసుకుంటున్నారని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

పోలవరం ముంపు ప్రాంతాల్లో చాలామందికి పట్టాలు లేక.. భూమికి భూమి, పరిహారం పొందలేకపోయారు. పైగా ఆదివాసులను బలవంతంగా వెళ్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని హక్కుల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడవుల్లో సాగుభూమి ఉన్న ప్రతి గిరిజనుడికి అటవీ పట్టాలు ఇస్తామని, 50వేల ఎకరాలకు పట్టాలు పంపిణీ చేస్తామని సీఎం జగన్ చెప్పారని, కానీ సగానికి పైగా అర్జీలు తిరస్కరణకు గురయ్యాయని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే సగం ఆదివాసుల భూములు ఇతరుల చేతుల్లోకి వెళ్లాయని చెబుతున్నారు. దీనికి తోడు అధికారుల వేధింపులు, అరెస్టులు, కేసుల బారిన పడుతున్నారని చెబుతున్నారు. ఇటీవల షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులకు 100 శాతం రిజర్వేషన్ జీవోను సుప్రీం కోర్టు రద్దు చేసింది. ఆదివాసేతరులు జొరబడటానికి ఇది అవకాశంగా ఏర్పడుతోంది. తమ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా అవి కాగితాలకే పరిమితమవుతున్నాయని ఆదివాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.