Begin typing your search above and press return to search.

బీజేపీకి తెలుగోడి తొలి దెబ్బ ఖాయ‌మే!

By:  Tupaki Desk   |   29 March 2018 6:27 AM GMT
బీజేపీకి తెలుగోడి తొలి దెబ్బ ఖాయ‌మే!
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో మాట మార్చేసిన బీజేపీ... ప్ర‌త్యేక హోదా కాదు క‌దా, ప్ర‌త్యేక హోదాకు బ‌దులుగా ఇస్తామ‌ని చెప్పిన ప్ర‌త్యేక ప్యాకేజీ కింద కూడా నిధులు విదిల్చిన పాపాన పోలేద‌న్న‌ది స‌గ‌టు ఏపీ వాసి భావ‌న‌గా వినిపిస్తోంది. రాష్ట్ర విభ‌జ‌న సంద‌ర్భంగా ఐదేళ్లు కాదు ప‌దేళ్ల పాటు ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాలంటూ నాడు విప‌క్ష హోదాలో ఉన్న బీజేపీ డిమాండ్ ను ఇప్పుడు ప్ర‌తి ఆంధ్రుడు గుర్తు చేసుకుంటున్న ప‌రిస్థితి. అయితే ఎంత‌గా ఆందోళ‌న‌లు చేసినా క‌నీసం ఏపీ వైపు దృష్టి సారించేందుకే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ - బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాలు ససేమిరా అంటున్నారు. ఈ క్రమంలో త‌మ‌ను వంచించిన బీజేపీకి త‌గిన గుణ‌పాఠం చెప్పి తీరాల్సిందేన‌న్న కోణంలో ఆంధ్రులంతా ఒక్కుమ్మ‌డిగా క‌దిలేందుకు కూడా సిద్ధ‌ప‌డుతున్న వైనం ఇప్పుడు చాలా విస్ప‌ష్టంగానే క‌నిపిస్తోంది.

మొత్తంగా ఏపీకి అన్యాయం చేసిన బీజేపీకి తెలుగోడి దెబ్బ రుచి ఏమిటో చూపించాల్సిందేన‌ని కూడా ప్ర‌తి ఆంధ్రుడు భావిస్తున్నాడు. అయితే ఈ దెబ్బ ఎక్క‌డి నుంచి త‌గులుతుంద‌న్న విష‌యంపై ఇప్పుడు తెర మీద‌కు వ‌చ్చిన ఓ అంశం ఆస‌క్తికరంగా మారింద‌ని చెప్పాలి. ఆ అంశం పూర్తి వివ‌రాల్లోకెళితే... క‌ర్ణాట‌క అసెంబ్లీకి త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే షెడ్యూల్ విడుద‌ల కాగా... దాదాపుగా అన్ని పార్టీలు కూడా ఎన్నిక‌ల ప్ర‌చారంలో మునిగిపోయాయి. ఈ ఎన్నిక‌లు ఇత‌ర పార్టీల‌కు ఎలా ఉన్నా... బీజేపీ, కాంగ్రెస్‌లకు మాత్రం అత్యంత కీల‌క‌మ‌నే చెప్పాలి. ఎందుకంటే వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు క‌న్న‌డ ఎన్నిక‌ల‌ను సెమీ ఫైన‌ల్స్‌ గా భావిస్తున్నారు. కర్ణాట‌క‌లో విజ‌యంతో రెట్టించిన ఉత్సాహంతో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని ఆ రెండు పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో అక్క‌డ ఏ పార్టీ విజ‌యం సాధించాల‌న్నా కూడా మెజారిటీ ఓట‌ర్లున్న తెలుగోళ్ల‌దే కీల‌క భూమిక‌. ప్ర‌స్తుతం క‌న్న‌డ‌నాట క‌న్న‌డిగులు, ముస్లిం మైనారిటీల త‌ర్వాత అత్య‌దిక ఓట్ల శాతం ఉన్న వ‌ర్గం తెలుగోళ్లేన‌ట. 1991 జ‌నాభా లెక్క‌ల‌నే తీసుకుంటే... క‌ర్ణాట‌క మొత్తం ఓట్ల‌లో తెలుగోళ్ల ఓట్ల శాతం 16 నుంచి 20 శాతంగా ఉంద‌ట‌. ఇక ఇప్పుడు ఈ శాతం మ‌రింత‌గా పెరిగింద‌నే చెప్పాలి.

ఏపీకి బీజేపీ చేసిన అన్యాయంపై అగ్గి మీద గుగ్గిలం అవుతున్న అక్క‌డి తెలుగోళ్లు... వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీకి ఓటు వేయ‌రాద‌ని దాదాపుగా నిర్ణ‌యించుకున్నార‌ట‌. మొత్తం ఓట్ల‌లో 20 శాతానికి పైగా ఉన్న తెలుగోళ్ల ఓట్లు గంప‌గుత్త‌గా ప‌డిపోతే... కాంగ్రెస్ పార్టీ విజ‌యం న‌ల్లేరు మీద న‌డ‌కేన‌న్న భావ‌న కూడా వినిపిస్తోంది. అంటే... క‌న్న‌డ‌నాట బీజేపీకి తెలుగోళ్ల ఆగ్ర‌హంతో ప‌రాజ‌యం త‌ప్ప‌ద‌న్న మాట‌. మొత్తంగా ఏపీకి అన్యాయం చేసిన బీజేపీకి తొలి దెబ్బ ఏపీలో కాకుండా కన్న‌డ నాట ఎదురుకానుండటం ఇప్పుడు అత్యంత చ‌ర్చ‌నీయాంశంగా మారిపోయింద‌ని చెప్పక త‌ప్పదు. క‌న్న‌డ నాట ఉన్న తెలుగోళ్ల ఓట్ల‌ను కోల్పోయిన బీజేపీ... అక్క‌డ మ‌రో మెజారిటీ వ‌ర్గంగా ఉన్న త‌మిళ తంబీల ఓట్ల‌ను కూడా కోల్పోయే ప్ర‌మాదం లేక‌పోలేదు. కావేరీ బోర్డు ఏర్పాటు విష‌యంలో బీజేపీ స‌ర్కారు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుకు నిర‌స‌న‌గా క‌న్న‌డ‌నాట ఉన్న తంబీలంతా ఆ పార్టీకి ఓటు వేయ‌రాద‌ని తీర్మానించేసుకున్నార‌ట‌. అంటే... ఓ ప‌క్క తెలుగోడి దెబ్బ‌ - మ‌రో ప‌క్క త‌మిళోడి దెబ్బ‌తో క‌న్నడ‌నాట బీజేపీకి ఘోర ప‌రాజ‌యం త‌ప్ప‌ద‌న్న కోణంలో విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.