Begin typing your search above and press return to search.

ఆ ముఖ్యమంత్రిపై మళ్లీ ఇంకు పడింది

By:  Tupaki Desk   |   5 Oct 2016 5:20 AM GMT
ఆ ముఖ్యమంత్రిపై మళ్లీ ఇంకు పడింది
X
స్వల్ప వ్యవధిలో ఎంతగా ప్రజాభిమానాన్ని సంపాదించారో..అదే స్థాయిలో తనపై వ్యతిరేకత తెచ్చుకున్న ముఖ్యమంత్రులు కాస్తంత అరుదుగా కనిపిస్తుంటారు. అలా తన మాటలతో.. చేతలతో తరచూ జాతీయ మీడియాలో దర్శనమిచ్చే ముఖ్యమంత్రిగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గా చెప్పొచ్చు. ఆయన్ను కీర్తిస్తూ ఉండే వారు ఎంతమందో.. ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకించేవారూ అంతమందే ఉంటారు. మరే ముఖ్యమంత్రికి ఎదురుకాని చిత్రమైన పరిస్థితులు కేజ్రీవాల్ కే ఎదురవుతాయని చెప్పొచ్చు.

సిరా.. చెప్పులు.. టమోటాలు.. ఇలా అది ఇది అన్న తేడా లేకుండా రకరకాలుగా కేజ్రీవాల్ పై తరచూ దాడులు జరుగుతూ ఉంటాయి. ఒక పార్టీ అధినేతగా.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న అధినేతకు ఇలాంటి చేదు అనుభవాలు ఆయనకు తప్పించి మరెవరికీ ఎదురుకావు. తాజాగా రాజస్థాన్ పర్యటనకు వెళ్లిన ఆయనపై సిరా దాడి జరిగింది. రాజస్థాన్ లోని బికనీర్ లోని తమ పార్టీకి చెందిన స్థానిక నేత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి వెళ్లారు. రాత్రి పది గంటల సమయంలో సదరు నేత ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో దినేశ్ ఓఝూ అనే యువకుడు సీఎం కేజ్రీవాల్ ముఖం మీద సిరా పోశారని చెబుతున్నారు.

దీనికి సంబంధించిన ఫోటోలేవీ బయటకు రాలేదు. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు సదరు యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కేజ్రీవాల్ మీద ఇంకు దాడి చేసిన వ్యక్తి స్థానిక ఏబీవీపీ నేతగా చెబుతున్నారు. ఇలాంటి చేదు అనుభవమే జనవరిలోనూ కేజ్రీవాల్ కు ఎదురైంది. ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి విడిపోయిన బ్యాచ్ కి సంబంధించిన ఒక మహిళా నేత కేజ్రీవాల్ పై ఇంకు పోసింది. తాజాగా జరిగిన ఘటనపై ట్విట్టర్ లో స్పందించిన కేజ్రీవాల్.. తనపై ఇంకు పోసిన వారిని దేవుడు ఆశీర్వదించాలని.. వాళ్లు బాగుండాలని తాను కోరుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. దేశంలో ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ.. ఎవరికి ఎదురు కాని ఈ తరహా దాడులు కేజ్రీవాల్ మీదనే ఎందుకు జరుగుతాయో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/