Begin typing your search above and press return to search.

లాల్ బహదూర్ శాస్త్రిది సాధారణ మరణం కాదా..? నాడు ఏం జరిగింది..? విచారణకు డిమాండ్

By:  Tupaki Desk   |   21 July 2022 12:30 PM GMT
లాల్ బహదూర్ శాస్త్రిది సాధారణ మరణం కాదా..? నాడు ఏం జరిగింది..? విచారణకు డిమాండ్
X
1965లో భారత, పాకిస్తాన్ యుద్ధం ముగిసింది. ఆ తరువాత 1966 జనవరిలో అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ తో నాటి భారత ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి భేటీ అయ్యారు. ఇందుకోసం ఆయన సోవియట్ యూనియన్ లోని తాష్కెంట్ వెళ్లారు. భారత్, పాక్ సంయుక్త ప్రకటన చేసి సంతకం చేశారు. ఆ తరువాత కొన్ని గంటలల్లోనే ప్రధానమంత్రి హోదాలో లాల్ బహదూర్ శాస్త్రి అకస్మాత్తుగా మరణించారు. అయితే ఆయన గుండెపోటుతో మరణించారని అన్నారు. కానీ శాస్త్రి మరణంపై ఎన్నో సందేహాలు.. ఎన్నో ప్రశ్నలు మిగిలాయి.. తాజాగా ఆయన మనువడు విభాకర్ శాస్త్రి తన తాత మరణంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన డిమాండ్ వెనుక అసలు కారణం ఏంటంటే..?

లాల్ బహదూర్ శాస్త్రి మరణించిన తరువాత ఆయన గుండెపోటుతో మరణించలేదని, ఇతర కారణాలున్నాయని చాలా మంది ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయన మృతిపై విచారణ జరిపేందుకు జనతా పార్టీ హయాంలో రాజ్ నారాయణ్ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఆ నివేదికను ఎవరూ బయటపెట్టలేదు. ఆ తరువాత నవదీప్ గుప్తా అనే సమాచార హక్కు కార్యకర్త మాజీ ప్రధాని శాస్త్రి మృతికి సంబంధించిన పత్రాలు బయటపెట్టాలని 2017 జూలై 14న కేంద్ర హోం శాఖ మంత్రిత్వ శాఖకు స.హ. చట్టం కింద దరఖాస్తు చేశారు.

హోంశాఖ ఈ దరఖాస్తును ‘నేషనల్ ఆర్కెవ్స్ ఆఫ్ ఇండియా’కు పంపించారు. కానీ వారు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఆ తరువాత సమాచారం రాకపోవడంతో సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు (సీపీఐవో)సహా విదేశాంగ, హోంశాఖలను సమాచార కమిషన్ ఆదేశించింది. 2018 సెప్టెంబర్ 24న అప్పటి విదేశాంగ మంత్రి చేసిన ప్రకటనను పొందుపరుస్తూ తుది ఆదేశాలు జారీ చేశారు.

శాస్త్రితో పాటు తాష్కెంట్ వెళ్లిన ప్రతినిధుల బృందంలో ప్రముఖ జర్నలిస్టు కులదీప్ నయ్యర్ ఉన్నారు. ఆయన రాసిన పుస్తకంలో పలు అనుమానాస్పద అంశాలు ఉన్నాయి. ‘తాష్కెంట్ ఒప్పందం జరిగిన మరుసటి రోజు అంటే 1966 జనవరి 11న వేకువ జామున 1.20 గంటలకు శాస్త్రి అస్వస్థతకు గురయ్యారు. తొలుత ఆయన వ్యక్తిగత వైద్యుడు ఆన్.ఎన్.చుగ్ వచ్చి పరిశీలించారు. అప్పటికే శాస్త్రి తీవ్రమైన దగ్గుతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. దీంతో ఆయన శాస్త్రికి మెప్తేటేయిన్ సల్ఫేట్ మికైనా ఇంజక్షన్ ఇచ్చారు. అనంతరం 3 నిమిషాలకే శాస్త్రి సృహ కోల్పోయారు. ఆ తరువాత కొద్ది సేపట్లోనే గుండె కొట్టుకోవడం ఆగిపోయింది’ అని రాశారు.

తాజాగా ఆయన మనువడు విభాకర శాస్త్రి తన తాత మరణంపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే సీఐఏ మాజీ అధికారి రాబర్ట్ క్రౌలీ ఓ పుస్తకంలో శాస్త్రి గురించి సంచలన విషయం రాశాడు. లాల్ బహదూర్ శాస్త్రి మరణానికి సీఐఏ నే కారణం అని అందులో ప్రస్తావించాడు. దీంతో ఆయన మృతిపై మరోసారి చర్చనీయాంశంగా మారింది. దీంతో విభాకర శాస్త్రి రాబర్ట్ క్రౌలీ రాసిన పేపర్స్ ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసి శాస్త్రి మృతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.

శాస్త్రి మృతి కేసులో విచారణ జరపడానికి కమిటీ ఏర్పాటు చేయాలని, ఆయన ఎలా చనిపోయారన్న ప్రశ్నకు ప్రతి భారతీయుడికి సమాధానం కావాలని అన్నారు. ఆరోజు రాత్రి మా తాతయ్యకు ఏం జరిగిందన్న విషయం బయటకు రావాలని ప్రశ్నిస్తున్నారు. ఆయన మరణంపై ఇప్పటికీ సందేహాలున్నాయని చాలామంది మథన పడుతున్నారని, అందువల్ల ప్రధానమంత్రి మోదీ ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరారు.