Begin typing your search above and press return to search.

‘ధరణి’పై విచారణ....కేసీఆర్ కు హైకోర్టులో ఊరట

By:  Tupaki Desk   |   21 Dec 2020 3:45 AM GMT
‘ధరణి’పై విచారణ....కేసీఆర్ కు హైకోర్టులో ఊరట
X
తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ల విషయంలో గందరగోళం ఏర్పడిన సంగతి తెలిసిందే. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లలో స్లాట్‌ బుకింగ్ విధానంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడడంతో ఆ విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది తెలంగాణ సర్కార్. స్లాట్ బుకింగ్ విధానం, ఆధార్ కార్డు తప్పనిసరి చేయడం, కులం వెల్లడించడం వంటి విషయాలపై కొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారణ జరిపిన హైకోర్టు...నవంబరు 3న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై హైకోర్టు నవంబరు 3న స్టే విధించింది. సాగు భూముల యజమానుల ఆధార్, కులం వివరాలు కావాలని ఒత్తిడి చేయవద్దని సూచించింది. అయితే, ఈ స్టే ఎత్తివేయాలంటూ హైకోర్టులో ప్రభుత్వం వెకేట్‌ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు...ఈ కేసు తదుపరి విచారణను డిసెంబరు 31కి వాయిదా వేసింది. ఈ లోపు వెకేట్ పిటిషన్ పై అభ్యంతరాలను తెలపాల్సిందిగా పిటిషనర్లను హైకోర్టు ఆదేశించింది.

ఈ వ్యవహారంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు రద్దు చేయాలని హైకోర్టును తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఇందుకు గాను తాజాగా వెకేట్ పిటిషన్ దాఖలు చేసింది. సాగుభూములపై కొన్ని సబ్సిడి పథకాలు అమల్లో ఉన్నాయని, కాబట్టి ఆధార్ వివరాలు అడిగే అవసరం, అవకాశం ప్రభుత్వానికి ఉన్నాయని వెల్లడించింది. సబ్సిడీ అమలుకు ఆధార్ కార్డును పరిగణలోకి తీసుకోవచ్చని చట్టం చెబుతోందని కోర్టుకు ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన హైకోర్టు...వెకేట్ పిటిషన్ పై అభ్యంతరాలను డిసెంబరు 31లోగా సమర్పించాలని పిటిషనర్లకు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను డిసెంబరు 31కి వాయిదా వేసింది. కాగా, సోమవారం నుంచి తెలంగాణలో పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల స్లాట్‌ బుకింగ్‌ను నిలిపివేయాలన్న హైకోర్టు ఆదేశాల ప్రకారం కార్డ్ పద్ధతి కొనసాగుతోంది. ఆల్రెడీ స్లాట్‌ బుక్‌ చేసుకున్నవారికి యథావిధిగా రిజిస్ట్రేష్లను నిర్వహించనున్నారు. ప్రజల ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.