Begin typing your search above and press return to search.

ఐఎన్‌ఎస్‌ 'విశాఖ'.. జాతికి అంకితం చేయనున్న రాజ్‌నాథ్‌ సింగ్‌ !

By:  Tupaki Desk   |   17 Nov 2021 3:30 PM GMT
ఐఎన్‌ఎస్‌ విశాఖ.. జాతికి అంకితం చేయనున్న రాజ్‌నాథ్‌ సింగ్‌ !
X
విశాఖకు తాజాగా ఓ అరుదైన గుర్తింపు లభించింది. ప్రాజెక్టు 15–బీలో భాగంగా ఐఎన్‌ ఎస్‌ విశాఖపట్నం పేరుతో భారీ యుద్ధ నౌక సిద్ధమైంది. దీన్ని ఈ నెల 21న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ జాతికి అంకితం చేయనున్నారు. ఈ యుద్ధ నౌక తూర్పు నౌకాదళ బలాన్ని మరింత ఇనుమడింపజేస్తుందనడం లో ఎలాంటి సందేహం లేదు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ నౌక శత్రువుల పాలిట సింహస్వప్నంగా అధికారులు చెప్తున్నారు. 1971లో జరిగిన యుద్ధంలో పాకిస్థాన్‌ని ఓడించి, జాతి గర్వించదగ్గ గెలుపునందించిన విశాఖ పేరు వింటే,తెలుగు ప్రజల గుండె ఉప్పొంగుతుంది. మరి సముద్ర రక్షణలో శత్రువులను సమర్థంగా ఎదుర్కొనే యుద్ధ నౌకని విశాఖపట్నం పేరుతో పిలిచే రోజు సమీపించింది.

భారత నౌకాదళం ఐఎన్‌ ఎస్‌ విశాఖపట్నం పేరుతో భారీ యుద్ధ నౌకని సిద్ధం చేసింది. ఈ నెల 21న రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్‌ చేతుల మీదుగా ముంబైలో జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం తూర్పు నౌకాదళం కేంద్రంగా ఐఎన్‌ ఎస్‌ విశాఖపట్నం సేవలందించనుంది. ఆత్మ నిర్భర్‌ భారత్‌లో భాగంగా ప్రాజెక్ట్‌–15బీ పేరుతో నాలుగు స్టెల్త్‌ గైడెడ్‌ మిసైల్‌ డిస్ట్రాయర్‌ యుద్ధ నౌకలు తయారు చేయాలని భారత నౌకాదళం సంకల్పించింది. ఈ నౌకలకు దేశంలోని నాలుగు ప్రధాన దిక్కుల్లో ఉన్న కీలక నగరాలు విశాఖపట్నం, మోర్ముగావ్, ఇంఫాల్, సూరత్‌ పేర్లు పెట్టాలని నిర్ణయించింది. తొలి షిప్‌ని విశాఖపట్నంపేరుతో తయారు చేశారు.

2011 జనవరి 28న ఈ ప్రాజెక్టు ఒప్పందం జరిగింది. 2013 అక్టోబర్‌లో షిప్‌ తయారీ పనులను వై–12704 పేరుతో ముంబైలోని మజ్‌గావ్‌ డాక్స్‌ లిమిటెడ్‌(ఎండీఎల్‌) ప్రారంభించింది. ఇది సముద్ర ఉపరితలంపైనే ఉంటుంది. కానీ ఎక్కడి శత్రువుకి సంబంధించిన లక్ష్యాన్నైనా ఛేదించి మట్టుబెట్టగలదు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్‌ ఎస్‌ విశాఖపట్నం శత్రువుల పాలిట సింహస్వప్నంగా చెప్పుకోవచ్చు. సాగర గర్భాన్ని శోధిస్తూ భారత భూభాగాన్ని పరిరక్షిస్తూ.. తిరుగులేని శక్తిగా సేవలందించేందుకు మరో నౌక సన్నద్ధమవుతోంది.1981 నుంచి దేశ రక్షణలో ముఖ్య భూమిక పోషిస్తూ అనేక కీలక ఆపరేషన్లలో తనదంటూ ప్రత్యేక ముద్ర వేసుకుని, ఈ ఏడాది జూన్‌లో సేవల నుంచి ఐఎన్‌ ఎస్‌ సంధాయక్‌ నిష్క్రమించింది.

హిందూ మహా సముద్ర ప్రాంతంలో మారుతున్న పవర్‌ డైనమిక్స్‌కి అనుగుణంగా విధులు నిర్వర్తించేలా ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం సత్తా చాటనుంది. ఈ యుద్ధ నౌక తూర్పు నౌకాదళ బలాన్ని మరింత ఇనుమడింపజేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా డిజిటల్‌ సర్వే కచ్చితత్వ ప్రమాణాల్ని పసిగట్టేవిధంగా సంధాయక్‌ కూడా త్వరలోనే కమిషనింగ్‌కు సిద్ధమవుతోందని వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహద్దూర్‌ సింగ్, తూర్పు నౌకాదళాధిపతి తెలిపారు.