Begin typing your search above and press return to search.

జాతీయ చిహ్నంపై రాద్దాంతం అవసరమా ?

By:  Tupaki Desk   |   18 July 2022 4:30 PM GMT
జాతీయ చిహ్నంపై రాద్దాంతం అవసరమా ?
X
జాతీయ చిహ్నమైన మూడు సింహాల మార్పుపై పెద్ద రాద్దాంతమే జరుగుతోంది. అశోక చక్రవర్తి సారనాథ్ లో అప్పుడెప్పుడో స్థూపంపై చెక్కించిన మూడు సింహాల మొహాలే దశాబ్దాలుగా జాతీయ చిహ్నంగా చెలామణి అవుతోంది.

ఆ చిహ్నాన్ని ఇపుడు నరేంద్రమోడీ మార్పులు చేశారంటు ప్రతిపక్షాలు, చరిత్రకారులు నానా రచ్చచేస్తున్నారు. వీళ్ళ గోలేమిటంటే సింహాల మొహాలను క్రూరంగా చూపాలన్న మోడీ ఆలోచనల ప్రకారమే జాతీయ చిహ్నం మౌలిక స్వభావాన్నే మార్చేసినట్లు గోలచేస్తున్నారు.

ప్రతిపక్షాల నేతలైనా, చరిత్రకారులైనా గమనించాల్సిందేమంటే సింహమంటేనే క్రూరజంతువు. క్రూరజంతువు మొహం క్రూరంగా ఉండకుండా శాంతంగా ఎలాగుంటుంది ? సింహం కోరలు బయటకు కనబడితేనేమి ? కనబడకపోతే ఏమిటి ? జాతీయచిహ్నమైన సింహం మొహం క్రూరంగా, కోరలు బయటకు కనబడకుండా ఉండాలన్నదే వీళ్ళ వాదనైతే జాతీయ చిహ్నంగా సింహాన్ని తీసేసి గోవును పెట్టుకోవాలి. ప్రశాంతతకు చిహ్నమైన గోవును జాతీయ చిహ్నంగా పెట్టుకుంటే ఎలాంటి గొడవా ఉండదు. పైగా గోవు చాలామందికి పూజ్యనీయమే కదా.

ప్రతిపక్షాలంటే ప్రతిదానికీ గోల చేయటమేనా ? మామూలుగా అయితే జాతీయ చిహ్నాన్ని జనాలు ఎంతమంది పట్టించుకుంటున్నారు ? ఇన్ని కోట్లమంది జనాల్లో అశోకుడి స్థూపం గురించి ఎంతమందికి తెలుసు ? ఇంత గోలచేస్తున్న ప్రతిపక్ష నేతల్లో అశోకుడి స్ధూపంలోని చక్రంలో ఎన్ని పుల్లలుంటాయో (స్పోక్స్) తెలుసా ? సింహం మొహం క్రూరంగా ఉంటే ఏమి ? ప్రశాంతంగా ఉంటేనేమి ? నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని తప్పు పట్టడానికి, మోడీ ఫెయిల్యూర్లపై ధ్వజమెత్తటానికి ప్రతిపక్షాలకు కావాల్సినన్ని అంశాలు కళ్ళముందు కనబడుతున్నాయి.

వాటన్నింటిని వదిలేసి జనాలకు ఎలాంటి సంబంధంలేని అశోకుడి స్థూపం, సింహాల మొహాలు క్రూరంగా కనబడుతున్నాయని గోల చేయటంలో అర్ధమేలేదు. జనాలకు పనికొచ్చే అంశాలపై చర్చలు జరిపినా ఉపయోగముంటుంది కానీ అనవసరమైన విషయాలపై రాద్దాంతం జరిగితే సమయాన్ని వృధా చేయటమే.