Begin typing your search above and press return to search.

ఇక ముస్లిం న‌కిలీ బాబాల సంగ‌తి తేలుస్తార‌ట‌

By:  Tupaki Desk   |   16 Sep 2017 12:01 PM GMT
ఇక ముస్లిం న‌కిలీ బాబాల సంగ‌తి తేలుస్తార‌ట‌
X
డేరా స‌చ్చా సౌధా అధినేత గుర్మిత్ రామ్ ర‌హీంసింగ్ న‌కిలీ బాబా అవ‌త‌రం వెలుగులోకి వ‌చ్చిన త‌ర్వాత అంద‌రి దృష్టి బాబాల దొంగ చేష్ట‌ల‌పై ప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ క్ర‌మంలో ప‌లువురు లౌకిక‌వాదులు - వామ‌ప‌క్షాల నేత‌లు హిందూ మ‌తంలో న‌కిలీ బాబాలు ఉన్నారంటూ విమ‌ర్శ‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో కొద్దికాలం క్రితం అఖిల భారత అఖారా పరిషద్ 14 మంది నకిలీ బాబాల పేర్లతో ఒక జాబితాను విడుదల చేసింది. ఈ సంద‌ర్భంగా హిందూ మ‌తంలో మాత్ర‌మే న‌కిలీ స్వామీజీలు లేర‌ని - ఇత‌ర మ‌తాల్లోనూ ప్రార్థ‌న‌ల పేరుతోనో మ‌రో రూపంలోనో ప్ర‌జ‌ల్ని మోసం చేస్తున్న‌వారు ఉన్నార‌ని పేర్కొంటూ ఆయా మ‌త‌పెద్ద‌లు సైతం ప్ర‌జ‌ల్ని జాగ‌రుకుల్ని చేయాల‌ని కోరింది.

ఈ పిలుపున‌కు స్పందించి అయి ఉండ‌వ‌చ్చు లేదా ముస్లిం మ‌తంపై ప‌డుతున్న మ‌చ్చ‌ను తుడిచివేసుకునేందుకు కావ‌చ్చు... అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు (ఎఐఎంపిఎల్‌ బీ) కీల‌క ముంద‌డుగు వేసింది. అఖిల భారత అఖారా పరిషద్ వ‌లే...ముస్లిం మ‌తంలోని నకిలీ మత గురువులను ఏరివేయడానికి సంకల్పించింది. ఇటీవలి కాలంలో టీవీ ఛానెళ్లలో ఇస్లాం - షరియాల మీద అవగాహన అంతగా లేని నకిలీ మత గురువులు చర్చల్లో కనిపిస్తున్నారని ఎఐఎంపీఎల్‌ బి కార్యవర్గ సభ్యుడు మౌలానా ఖాలిద్‌ రషీద్‌ ఫరంగి మహాలి వ్యాఖ్యానించారు. కేవలం తలపై టోపి పెట్టుకుని - గడ్డం పెంచుకుని టెలివిజన్ చర్చల్లో వారు పాల్గొంటున్నారని మహాలీ అన్నారు. ఇటువంటి వారి వల్ల మొత్తం ముస్లిం సమాజానికే నష్టం వాటిల్లుతోందని, చెడుపేరు వస్తోందని ఆయన చెప్పారు. ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఎఐఎంపీఎల్‌ బీ త్వరలో సూచిస్తానని ఆయన అన్నారు. అలాగే టెలివిజన్‌ చర్చల్లో పాల్గొనడానికి మత గురువుల పేర్లను బోర్డు సూచించే విధంగా సలహా ఇస్తానని ఆయన అన్నారు.