Begin typing your search above and press return to search.

జాతీయ జెండాకు అవ‌మానం!..బాబే సాక్షి!

By:  Tupaki Desk   |   27 Jan 2018 11:57 AM GMT
జాతీయ జెండాకు అవ‌మానం!..బాబే సాక్షి!
X
జాతీయ జెండా... మువ్వ‌న్నెల ప‌తాకం... గాల్లో అలా ఎగురుతుంటే... ప్ర‌తి భార‌తీయుడి గుండె పుల‌కించి పోతుంది. అదే స‌మ‌యంలో అదే జాతీయ జెండాకు ఏ చిన్న అవ‌మానం జ‌రిగినా... ప్ర‌తి భార‌తీయుడి గుండె ర‌గిలిపోతుంది. ఈ రెండు విష‌యాల‌ను బాగానే ఒంట‌బ‌ట్టించుకున్న రాజ‌కీయ నేత‌లు... జాతీయ జెండాకు ఎలాంటి అవ‌మానం జ‌ర‌గ‌కుండా చాలా జాగ్ర‌త్త‌లే తీసుకుంటారు. అయితే ఈ త‌రహా జాగ్ర‌త్తప‌రులైన రాజ‌కీయ నేత‌ల‌కు టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు భిన్న‌మ‌నే చెప్పాలి. ఎందుకంటే... ఏపీకి పెట్టుబడులు రాబ‌ట్టేందుకంటూ దావోస్‌ లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ ఎక‌న‌మిక్ ఫోరం వార్షిక స‌ద‌స్సుకు మందీ మార్బ‌లాన్ని వెంటేసుకుని వెళ్లిన చంద్ర‌బాబు... భార‌త గ‌ణతంత్ర దినోత్స‌వ వేడుక‌ల‌కు స‌కాలంలో హాజ‌రు కాలేక‌పోయారు. ఈ విష‌యంలో కించిత్ కూడా విచారం వ్య‌క్తం చేసేందుకు ఇష్ట‌ప‌డ‌ని చంద్ర‌బాబు నిన్న రాత్రి రిప‌బ్లిక్ డే నాడే జాతీయ జెండాను తీవ్రంగా అవ‌మానించేశార‌న్న వాద‌న వినిపిస్తోంది. ఓ వైపు సీఎంగా ఉన్న వ్య‌క్తే రిప‌బ్లిక్ వేడుక‌ల‌కు హాజ‌రు కారా? అన్న కోణంలో జ‌నం నుంచి ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌వుతుంటే... వాటిని చాలా లైట్ తీసుకున్న చంద్రబాబు నిన్న ఢిల్లీ నుంచి నేరుగా గ‌న్న‌వ‌రం చేరుకుని అక్కడి నుంచి అమ‌రావ‌తి వెళ్లిపోయారు.

ఆ త‌ర్వాత విజ‌య‌వాడ న‌గ‌రంలో నిన్న ప్రారంభ‌మైన ఆలిండియా సివిల్ స‌ర్వెంట్స్ క్రికెట్‌ టోర్న‌మెంటును ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగానే మువ్వ‌న్నెల జెండాకు ఘోర అవ‌మానం జ‌రిగిపోయింది. అది కూడా చంద్ర‌బాబు సాక్షిగానే జ‌రిగినా... బాబు మాత్రం ఆ విష‌యం త‌న‌కు తెలియ‌ద‌న్న‌ట్లుగానే వ్య‌వ‌హ‌రించార‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఈ ఘ‌ట‌న పూర్తి వివ‌రాల్లోకెళితే... టోర్నీ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా చంద్ర‌బాబు జాతీయ జెండాతో పాటుగా శాప్‌ - టోర్న‌మెంటు జెండాల‌ను ఆవిష్క‌రించాల్సి ఉంది. ఈ మూడు జెండాలు ఏర్పాటు చేసిన స్థ‌లానికి వ‌చ్చిన చంద్ర‌బాబు... తొలుత జాతీయ జెండాను ఆవిష్క‌రించేందుకు స‌మాయ‌త్త‌మ‌య్యారు. అయితే అనుకోని కార‌ణాల‌తో జాతీయ జెండా క‌ర్ర‌కు క‌ట్టిన తాడు ఊడి రాలేదు. సాధార‌ణంగా మ‌రెవ‌రైనా అయితే... ఆ తాడును స‌రిచేయించి జాతీయ జెండాను ఎగుర‌వేసిన త‌ర్వాతే అక్క‌డి నుంచి క‌దులుతారు. అయితే చంద్ర‌బాబు అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించారు.

తాడు ఊడి రాక‌పోవ‌డంతో జాతీయ జెండాను ఎగుర‌వేయ‌కుండానే ముందుకు క‌దిలిన చంద్ర‌బాబు... జాతీయ జెండా ప‌క్క‌నే ఏర్పాటు చేసిన శాప్‌ - టోర్న‌మెంటు జెండాల‌ను ఆవిష్క‌రించేసి జాతీయ గీతాన్ని ఆల‌పించేశారు. ఆ తర్వాత చంద్ర‌బాబు ప‌క్క‌కు జ‌ర‌గ‌గానే... అధికారులు జాతీయ జెండా దిమ్మెను అక్క‌డి నుంచి తొల‌గించారు. ఈ క్ర‌మంలో జాతీయ జెండా ఆవిష్కరించకుండా సెల్యూట్‌ చేయడం - జాతీయ గీతాన్ని ఆలపించడం నిబంధనలకు విరుద్ధం. కానీ సీఎం - ఐఏఎస్‌ అధికారులు ఈ విష‌యాన్ని ఏమాత్రం ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. అంతేకాకుండా జాతీయ జెండా ఎగర‌లేద‌న్న విష‌యాన్ని ఓ రాష్ట్రానికి సీఎంగా ఉన్న చంద్ర‌బాబు చాలా లైట్ తీసుకోవ‌డం కూడా విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. మొత్తంగా ఈ వ్య‌వ‌హారం అంతా చంద్ర‌బాబు సమక్షంలోనే జరగడం అక్కడివారిని విస్మ‌యానికి గురి చేసింద‌నే చెప్ఆప‌లి. ఇదిలా ఉంటే... జాతీయ జెండా దిమ్మెను తొలగించిన విషయాన్ని మీడియా కవర్ చేసిన విష‌యాన్ని గ్ర‌హించిన అధికారుల బృందం మ‌రింత మేర విమ‌ర్శ‌లు రాకుండా హ‌డావిడి చేసేసి... మళ్లీ జాతీయజెండాను సరిచేసి యథాస్థానంలో దిమ్మెను నిలబెట్టడం గ‌మ‌నార్హం.