Begin typing your search above and press return to search.

ముగ్గురు వైసీపీ ఎంపీలకు అవమానం.. మంత్రి సారీ చెప్పాలి

By:  Tupaki Desk   |   30 Jan 2020 8:00 AM GMT
ముగ్గురు వైసీపీ ఎంపీలకు అవమానం.. మంత్రి సారీ చెప్పాలి
X
ప్రొటోకాల్ చిచ్చు వైసీపీ ఎంపీ, మంత్రులు పేర్ని నాని, ఆళ్ల నానిల మధ్య చిచ్చు పెట్టింది. తమను సమావేశంలో దారునంగా అవమానించారంటూ వైసీపీ ఎంపీలు రఘురామకృష్ణం రాజు, కోటగిరి శ్రీధర్ లు అలిగి వెళ్లిపోవడం కలకలం రేపింది. ఈ మొత్తం వివాదానికి వేదిక గా నిలిచింది పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధి మండలి సమీక్ష సమావేశం.

పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధి మండలి సమీక్ష సమావేశాన్ని జిల్లాలోని వైసీపీ ఎంపీలు ఇద్దరు బాయ్ కాట్ చేయడం వైసీపీ ప్రభుత్వంలో దుమారం రేపింది. మరో ఎంపీ కూడా ప్రొటోకాల్ పాటించలేదంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది.

పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధి మండలి సమీక్ష సమావేశానికి ఇన్ చార్జి మంత్రి పేర్ని నాని, డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, కలెక్టర్ ముత్యాల రాజు నిర్వహించారు. దీనికి వచ్చిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు వేదిక పై కూర్చోగా.. మరో ఇద్దరు ఎంపీలు కోటగిరి శ్రీధర్, మార్గాని భరత్ లు సీటు ఖాళీ లేక వేదిక కింద కూర్చున్నారు. అయితే కొందరు రఘురామకృష్ణం రాజును కూడా కిందే కూర్చోవాలని సూచించడంతో ఆయన అలిగి సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఆయనతోపాటు మరో ఎంపీ కోటగిరి కూడా అలిగి నిష్క్రమించారు. సమావేశంలోనే ఉన్న మరో ఎంపీ మార్గాని భరత్ కూడా మంత్రులు తమ కింద కూర్చుండబెట్టి అవమానించారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

*ప్రొటోకాల్ పాటించలేదంటే సారి చెబుతా..
ఎంపీలను అవమానించామని.. ప్రొటోకాల్ పాటించలేదని ఎవరైనా నిరూపిస్తే బహిరంగం గా క్షమాపణ చెప్పడానికి సిద్ధమని మంత్రి పేర్ని నాని తెలిపారు. ప్రొటో కాల్ ప్రకారమే సమావేశం నిర్వహించామని స్పష్టంచేశారు.

*మంత్రి నాని సారీ చెప్పాలి: ఎంపీ రఘురామ
అభివృద్ధి మండలి సమీక్ష సమావేశం లో తమను అవమానించారని ఎంపీ రఘురామకృష్ణం రాజు మీడియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. వేదికపై అధికారుల కంటే ప్రొటోకాల్ ప్రకారం తామే ఎక్కువ అని.. అయినా తమను కూర్చోనివ్వలేదని ఆరోపించారు. తాను దిశ కమిటీ సహా లోక్ సభ కమిటీలకు చైర్మన్ అని.. తనకు స్థానం ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. తనకు జరిగిన అవమానం.. తనకు ఓట్లు వేసిన ప్రజలకు జరిగిన అవమానం గా భావించానని అన్నారు. ఈ విషయ మై జిల్లా మంత్రి ఆళ్ల నాని సారి చెబుతారని అనుకుంటున్నానని.. ఇంకోసారి ఇలానే జరిగితే అసలు సమావేశాలకే హాజరు కామని రఘురామ స్పష్టం చేశారు.