Begin typing your search above and press return to search.

న్యాయ‌మూర్తుల‌పై దూష‌ణ‌లు.. తాజాగా సీబీఐ అరెస్టు చేసింది వీరినే!

By:  Tupaki Desk   |   13 Sep 2022 9:49 AM GMT
న్యాయ‌మూర్తుల‌పై దూష‌ణ‌లు.. తాజాగా సీబీఐ అరెస్టు చేసింది వీరినే!
X
2019 మేలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి తీసుకున్న ప‌లు నిర్ణ‌యాల‌ను, జీవోల‌ను హైకోర్టు త‌ప్పుబ‌ట్టిన సంగ‌తి తెలిసిందే. వీటిలో కొన్నిటిని ఏపీ హైకోర్టు రద్దు చేసింది. మూడు రాజ‌ధానుల ఏర్పాటు బిల్లు, రాజ‌ధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) ర‌ద్దు బిల్లుల‌ను తెస్తూ జారీ చేసిన జీవోల‌ను హైకోర్టు కొట్టేసింది. ఇలాగే ప‌లు నిర్ణ‌యాల్లో హేతుబ‌ద్ధ‌త‌ను ప్ర‌శ్నించింది. దీంతో కొంత‌మంది వైఎస్సార్సీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, ఆ పార్టీ సానుభూతిప‌రులు సోష‌ల్ మీడియా మాధ్య‌మాల ద్వారా హైకోర్టు న్యాయ‌మూర్తుల‌పై దూష‌ణ‌లు, బూతుల‌కు దిగిన సంగ‌తి తెలిసిందే. న్యాయ‌మూర్తుల తీర్పుల‌కు వ‌క్ర భాష్యాలు చెప్ప‌డం, దురుద్దేశాలు అంట‌గ‌ట్ట‌డంతో కోర్టు వీటిని సుమోటో కేసులుగా తీసుకుంది. సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించింది.

దీంతో సీబీఐ ఇప్ప‌టికే ప‌లువురిని అరెస్టు చేసింది. మ‌రికొంద‌రికి నోటీసులు జారీ చేసింది. గ‌తంలో 11 మందిని అరెస్టు చేయ‌గా తాజాగా మ‌రో ఏడుగురిని అరెస్టు చేసింది. వీరంతా వైఎస్ఆర్సీపీ కార్య‌క‌ర్త‌లే కావ‌డం గ‌మ‌నార్హం. వీరిలో ఒక మ‌హిళ కూడా ఉంది. నిందితులంద‌రినీ సీబీఐ అధికారులు సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు సెప్టెంబర్ 26వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

సీబీఐ అరెస్టు చేసిన వైఎస్సార్సీపీ కార్య‌క‌ర్త‌ల్లో సిహెచ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, జి. మల్లికార్జునరావు, అశోక్ రెడ్డి, ఎస్ రంగారావు, రామాంజనేయులు రెడ్డి, రవీంద్రనాథ్ ఉన్నారు. సీబీఐ ప్ర‌త్యేక కోర్టు న్యాయ‌మూర్తి వీరికి రిమాండ్ విధించ‌డంతో నిందితులను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.

సీబీఐ అధికారులు వీరిని త‌దుప‌రి విచారించ‌నున్నారు. సోష‌ల్ మీడియాలో జ‌డ్జిల‌ను దూషిస్తూ పోస్టులు పెట్టినందుకు చ‌ట్ట‌ప‌ర్య‌మైన చ‌ర్య‌లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తాజాగా ఇప్ప‌టివ‌ర‌కు ఈ ఏడుగురితో క‌లిపి 18 మంది జైలులో ఉన్నారు.

కాగా, 'వైఎస్సార్సీపీ సోషల్‌ మీడియా సైనికులకు విజ్ఞప్తి.. అరెస్టు విషయంలో ఎవ‌రూ భయపడాల్సిన పనిలేదు.. అరెస్టయిన వారికి న్యాయపరమైన సహాయ సహకారాలు అందించాం.. న్యాయవాదులు ఇప్పటికే కార్యాచరణలో భాగమయ్యారు.. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు' అంటూ వైఎస్సార్సీపీ నేత గుర్రంపాటి దేవేందర్‌రెడ్డి ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడం గమనార్హం. వైఎస్సార్సీపీ సీనియర్‌ నేత విజయసాయిరెడ్డి తదితరులు కూడా కార్యకర్తలు భయపడొద్దంటూ భరోసా ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.