Begin typing your search above and press return to search.

వ్యాలెట్ లావాదేవీల‌కు ఇన్సూరెన్స్‌

By:  Tupaki Desk   |   30 Jan 2017 4:18 PM GMT
వ్యాలెట్ లావాదేవీల‌కు ఇన్సూరెన్స్‌
X
పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత మెజార్టీ లావాదేవీలు డిజిట‌ల్ బాట ప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ లావాదేవీలు ఎంతో వేగంగా జ‌రుగుతున్నప్ప‌టికీ వాటిలోని భ‌ద్ర‌త‌పై కొన్ని సందేహాలు నెల‌కొన్నాయి. ఈ నేప‌థ్యంలో కేంద్రం తీపి క‌బురు అందించింది. ఎలక్ట్రానిక్ వ్యాలెట్ ద్వారా జరిపే లావాదేవీలకు సైతం బీమా కవరేజీ కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందని అధికారిక‌క వ‌ర్గాలు వివ‌రించారు. డిజిట‌ల్ లావాదేవీల‌కు బీమా స‌దుపాయం క‌ల్పించేందుకు గాను మొబైల్ వ్యాలెట్ కంపెనీలు - బీమా సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంద‌ని స‌మాచారం.. ఇప్పటికే 2-3 దఫాల్లో ఇరు వర్గాలతో చర్చలు జరిగాయని ఓ అధికారి తెలిపారు.

మొబైల్ వ్యాలెట్ సేవలకు సైతం బీమా కవరేజీ ద్వారా భద్రత కల్పించాలని, తద్వారా ఈ తరహా లావాదేవీలపై సామాన్యుల్లో నమ్మకం పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది. భారత్‌ను నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం..ఆ దిశగా పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఈ-వ్యాలెట్ లావాదేవీలకు బీమా సౌకర్యం కల్పించడంతోపాటు ఫోరెన్సిక్ ల్యాబ్‌లను కూడా ఎలక్ట్రానిక్ లావాదేవీల ఆధారాల అధికారిక పరిశీలక ఏజెన్సీగా హోదా కల్పించాలని కేంద్రం భావిస్తోంది. త‌ద్వారా సైబ‌ర్ మోసాలు జ‌రిగిన‌ప్ప‌టికీ వాటి ద్వారా వినియోగ‌దారులు మోస‌పోకుండా ఉండేందుకు త‌గు చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో భాగంగా ఈ ప్ర‌తిపాద‌న‌లు తెచ్చిన‌ట్లు స‌మాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/