Begin typing your search above and press return to search.

రేవంత్ ఇంటి ప‌రిస‌రాల్లో వారి డేగ‌క‌న్ను!

By:  Tupaki Desk   |   30 Oct 2017 7:10 AM GMT
రేవంత్ ఇంటి ప‌రిస‌రాల్లో వారి డేగ‌క‌న్ను!
X
తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల్లో రేవంత్ రెడ్డి హాట్ టాపిక్ అయ్యారు. తెలుగుదేశం పార్టీకి.. త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన ఆయ‌న‌.. ఈ రోజు హైద‌రాబాద్ లోని త‌న నివాసంలో ఒక‌ స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశానికి హాజ‌ర‌య్యేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప‌లువురు నేత‌లు వ‌స్తార‌ని భావిస్తున్నారు. రాష్ట్రంలోని 119 నియోజ‌క‌వ‌ర్గాల నుంచి త‌న అభిమానులు.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక నేత‌లు రేవంత్ ఇంటికి వ‌స్తార‌ని భావిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా త‌న భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌ను కూడా ఆయ‌న మీడియాకు వెల్ల‌డించ‌నున్న‌ట్లు చెబుతున్నారు. ఈ రోజు ఉద‌యం జూబ్లిహిల్స్ పెద్ద‌మ్మ గుడిలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించిన రేవ‌త్ రెడ్డి అనంత‌రం త‌న ఇంట్లో నేత‌లు.. కార్య‌క‌ర్త‌లు.. అభిమానుల‌తో స‌మావేశాన్ని నిర్వ‌హించ‌నున్నారు.

ఈ నేప‌థ్యంలో.. రేవంత్ ఇంటి ప‌రిస‌రాల్లో ఇంటెలిజెన్స్ అధికారులు పెద్ద ఎత్తున క‌వ‌ర్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. రేవంత్ ఇంటికి ఎవ‌రెవ‌రు వ‌స్తున్నారు? ఎంత‌సేపు రేవంత్ తో భేటీ అవుతున్నారు? రేవంత్‌ కు మ‌ద్ద‌తు ఇచ్చే నేత‌ల బ్యాక్ గ్రౌండ్ వివ‌రాల్ని సేక‌రించ‌టంతో పాటు.. ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌భుత్వానికి స‌మాచారం అందించే రీతిలో ఏర్పాట్లు చేసిన‌ట్లుగా తెలుస్తోంది. నిఘా విభాగానికి చెందిన వారు ఇంత భారీ ఎత్తున రేవంత్ ఇంటి ప‌రిస‌రాల్లో ఉండ‌టం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

ప్ర‌భుత్వం ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌తోనే ఈ ఏర్పాట్లు చేసిన‌ట్లుగా తెలుస్తోంది. రేవంత్ క‌ద‌లిక‌ల‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టిన అధికారులు.. ప్ర‌తి విష‌యాన్ని చాలా లోతుగా విశ్లేషిస్తున్న వైనం ప‌లువురి నేత‌ల మాట‌ల్లో వినిపిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. రేవంత్ తో స‌మావేశం అయ్యేందుకు కొడంగ‌ల్ నుంచి పెద్ద ఎత్తున క్యాడ‌ర్ ను తీసుకురావాల‌న్న ఉద్దేశంతో ఏర్పాట్లు జ‌రుగుతున్న‌ట్లుగా చెబుతున్నారు. అయితే.. ఇలాంటి వాటిని నిరుత్సాహప‌రిచే దిశ‌గా పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లుగా ఆరోప‌న‌లు వినిపిస్తున్నాయి. తుఫాన్‌.. క్రూజ‌ర్ లాంటి వాహ‌నాలు కొడంగ‌ల్‌ కు వెళ్ల‌కుండా వాహ‌న య‌జ‌మాన్యుల‌కు భారీ ఎత్తున హెచ్చ‌రిక‌లు జారీ చేసిన‌ట్లుగా చెబుతున్నారు. వాహ‌నాలు పెట్టొద్ద‌ని.. కార్య‌క‌ర్త‌లు.. అభిమానుల్ని త‌ర‌లించ‌కుండా పోలీసులు అడ్డుప‌డుతున్న‌ట్లుగా రేవంత్ వ‌ర్గీయులు ఆరోపించ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌ర అంశంగా మారింది.