Begin typing your search above and press return to search.

నిఘావ‌ర్గాలు నిద్ర పోతున్నాయా?

By:  Tupaki Desk   |   24 Sep 2018 10:03 AM GMT
నిఘావ‌ర్గాలు నిద్ర పోతున్నాయా?
X
సాధార‌ణంగా విశాఖ మ‌న్యంలో మావోయిస్టుల క‌ద‌లిక‌ల‌పై నిఘావ‌ర్గాలు నిరంత‌రం క‌న్నేసి ఉంచుతుంటాయి. ప్ర‌తి చిన్న విష‌యాన్నీ సునిశితంగా ప‌రిశీలిస్తుంటాయి. మావోల త‌దుప‌రి చ‌ర్య‌లు ఎలా ఉండ‌బోతున్నాయి? ఎక్క‌డెక్క‌డ వారి క‌ద‌లిక‌లు ఎక్కువ‌వుతున్నాయి? వ‌ంటి స‌మారాన్ని పోలీసుల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు చేర‌వేస్తుంటాయి. ముందుగానే హెచ్చ‌రిక‌లు జారీ చేస్తుంటాయి. మ‌రి ఎమ్మెల్యే హ‌త్య ప్ర‌ణాళిక‌ను నిఘా వర్గాలు ఎందుకు ముందుగానే ప‌సిగ‌ట్టలేక‌పోయాయి? 60 మంది మావోలు గుంపుగా వ‌చ్చి కిడారి - సివేరు సోమ‌ను హ‌త్య చేయ‌డానికి ప్లాన్ చేసుకుంటే దాన్ని ఎందుకు గుర్తించ‌లేక‌పోయిన‌ట్లు? నిఘావ‌ర్గాలు మరీ ఇంత స్త‌బ్ధుగా ఉన్నాయా? చాలామంది మెద‌ళ్ల‌ను తొలిచేస్తున్న ప్ర‌శ్న‌లివి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లే ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మ‌న్న‌ది కొంద‌రి వాద‌న‌. తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు మొత్తం త‌మ‌ దృష్టిని అక్క‌డి ఎన్నిక‌ల‌పైనే పెట్టాయ‌ని.. మావోల‌పై నిఘాను నిర్ల‌క్ష్యం చేశాయ‌ని ప‌లువురు చెవులు కొరుక్కుంటున్నారు. నిజానికి కిడారికి న‌క్స‌ల్స్ నుంచి ప్రాణ‌హాని ఉంద‌నే సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. స్వ‌యంగా కిడారికి కూడా ఈ విష‌యం తెలుసు. అందుకే అందుకే త‌న కుటుంబాన్ని విశాఖ‌ప‌ట్నం పంపించాడు. తాను కూడా పాడేరులోని ఐటీడీపీ గెస్ట్‌ హౌస్‌ కి మ‌కాం మార్చాడు. ఆ ప్రాంతం త‌న‌కు సుర‌క్షిత‌మ‌ని భావించాడు. ఈ ప‌రిణామాల‌న్నీ నిఘావ‌ర్గాలకు తెలిసే ఉంటాయి. కాబట్టి వారు కిడారికి మావోల నుంచి పొంచి ఉన్న ముప్పుపై మ‌రింత బాగా క‌న్నేసి ఉండాల్సింద‌న్న‌ది ప‌లువురి వాద‌న‌. కానీ, అలా చేయ‌డానికి బ‌దులుగా తెలంగాణ‌లో పొలిటిక‌ల్ మూడ్ ఎలా ఉంది? ఏయే స్థానాల్లో ఎవ‌రు గెలిచే అవ‌కాశాలున్నాయి? వ‌ంటి అంశాల‌ను తెలుసుకునేందుకే ఏపీ నిఘావ‌ర్గాలు ఎక్కువ ప్రాధాన్య‌మిచ్చాయ‌ని..మావోల క‌ద‌లిక‌ల‌పై నిఘాను గాలికొదిలేశాయ‌ని వారు విశ్లేషిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే ఎక్క‌డెక్క‌డికి - ఎప్పుడెప్పుడు వెళ్తున్నాడు? అనే విష‌యాల‌ను న‌క్స‌ల్స్ తెలుసుకొని రెక్కీ నిర్వ‌హించార‌ని.. హ‌త్య ప్ర‌ణాళిక‌ను సులువుగా పూర్తి చేశారని అభిప్రాయ‌ప‌డుతున్నారు. కాబ‌ట్టి ఎమ్మెల్యే హ‌త్యకు నిఘావ‌ర్గాల వైఫ‌ల్యమూ ఓ కార‌ణ‌మ‌ని ఆరోపిస్తున్నారు. ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన‌ మ‌రో ముఖ్య‌మైన‌ విష‌య‌మేంటంటే.. ఉత్త‌రాంధ్ర‌లో ప్ర‌స్తుతం పోలీసు నియామ‌క ప్రక్రియ కొన‌సాగుతోంది. దీంతో ప‌లువురు అధికారులు ఆ ప‌నుల్లో బిజీగా ఉన్నారు. అందుకే ఎమ్మెల్యే వెంట ఎక్కువ బ‌ల‌గాన్ని ప‌ర్య‌ట‌న‌ల‌కు పంప‌లేక‌పోతున్నారు. ఇది కూడా న‌క్స‌ల్స్ ప‌ని సుల‌భంగా పూర్త‌వ్వ‌డానికి ఓ కార‌ణ‌న‌న్న‌ది మ‌రికొంద‌రి విశ్లేష‌ణ‌.