Begin typing your search above and press return to search.

చెన్నై రాజ‌కీయాల్లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ క‌ల‌క‌లం

By:  Tupaki Desk   |   26 Dec 2017 11:05 AM GMT
చెన్నై రాజ‌కీయాల్లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ క‌ల‌క‌లం
X

ఆర్కేనగర్ ఎన్నికల్లో తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిపోతున్నాయి. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన శశికళ మేనల్లుడు - అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్‌.. అధికారంలో ఉన్న పళని-పన్నీర్‌ వర్గానికి చుక్కలు చూపించడానికి పావులు కదుపుతున్నారు. ఇప్ప‌టికే దినకరన్‌ ను అభినందించడానికి నేతలు ఆయన ఇంటికి క్యూ కడుతున్నారు. ఇదే స‌మ‌యంలో మూడు నెలల్లోనే ప్రభుత్వాన్ని పడగొడతానంటూ దినకరన్ విసిరిన సవాల్.. అధికార అన్నాడీఎంకేలో ప్రకంపనలు రేపుతోంది.

మ‌రోవైపు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ క‌ల‌క‌లం రేకెత్తిస్తోంది.మూడు నెలల్లో ప్రభుత్వం పడిపోవడం ఖాయమన్న దినకరన్‌.. అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను తనవైపు లాక్కునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. దాదాపు 30 మంది వరకూ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు దినకరన్‌ పిలుపు కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం. దినకరన్ వర్గం మాత్రం ఏకంగా 60 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది. దినకరన్ గెలవగానే.. ఆరుగురు మంత్రులు - 14 మంది ఎమ్మెల్యేలు ఆయనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పినట్లుగా ఇంటెలిజెన్స్‌ ఇప్పటికే సీఎంకు నివేదిక అందించినట్లు సమాచారం. ఈ ప‌రిణామం స‌ర్కారులో క‌ల‌క‌లానికి దారితీసింది. దినకరన్‌ నుంచి ముప్పు పొంచి ఉండడంతో.. ఎమ్మెల్యేలపై సీఎం పళని స్వామి నిఘా పెంచారు. అందరి కదలికలను ట్రాక్ చేసేందుకు నిఘావర్గాలను ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇదిలాఉండ‌గా...దినకరన్‌కు సన్నిహితంగా ఉండే పార్టీనేతలను బహిష్కరించడం ద్వారా.. వీరందరికీ హెచ్చరిక పంపించారు. అయితే.. దినకరన్‌ అసెంబ్లీలోకి అడుగుపెడితే.. తమిళ్‌ దంగల్‌ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. బలపరీక్షను నిరూపించుకోవాలంటూ.. పళని-పన్నీర్ సర్కార్‌ ను డిమాండ్‌ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే సాధారణ మెజార్టీతో అధికారంలో కొనసాగుతున్న అన్నాడీఎంకే నుంచి పదిమంది ఎమ్మెల్యేలు దినకరన్‌ వైపు వచ్చినా.. ప్రభుత్వం పడిపోవడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు.

ఆర్కేనగర్ ఉపఎన్నికలో ఏఐఏడీఎంకే అభ్యర్థి మధుసూధనన్‌ పై దినకరన్ 40,707 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన నేపథ్యంలో అధికార పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నది. డీఎంకేతో చేసుకున్న అప్రకటిత అవగా హన కారణంగానే ఆర్కేనగర్‌ లో గెలిచారంటూ ఏఐఏడీఎంకే నేతల చేసిన ఆరోపణలను ఆ పార్టీ తిరుగుబాటు నేత టీటీవీ దినకరన్ ఖండించారు. అది ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. తాను గెలువాలని కోరుకున్నవారు ఓటేసి ఉండవచ్చుకానీ, పార్టీ అధిష్ఠానం చెప్పినంత మాత్రాన కార్యకర్తలు ఓటు వేయరని దినకరన్ చెప్పారు. కాగా, ఏఐఏడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప.. సోమవారం దినకరన్‌ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన విజయం చరిత్రాత్మకమని, హిమాలయాలంత గొప్పదని పేర్కొన్నారు. మరోవైపు ఆర్కేనగర్ ఉపఎన్నికలో ఓటమికి గల కారణాలను అన్వేషించేందుకు డీఎంకే పార్టీ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.