Begin typing your search above and press return to search.

వైసీపీ ఎంపీ, టీడీపీ మాజీ ఎమ్మెల్యే మధ్య తీవ్ర వాగ్వాదం

By:  Tupaki Desk   |   15 Nov 2021 11:30 AM GMT
వైసీపీ ఎంపీ, టీడీపీ మాజీ ఎమ్మెల్యే మధ్య తీవ్ర వాగ్వాదం
X
అనంతపురం రాజకీయాల్లో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అనంతపురం జిల్లా హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్, పెనుగొండ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పార్థసారథి మధ్య తీవ్రవాగ్వివాదం చోటుచేసుకుంది. ఇది ఘర్షణకు దారితీసింది. వీరిద్దరిని సముదాయించలేక పోలీసుల తలప్రాణం తోకకు వచ్చింది.

రాష్ట్రవ్యాప్తంగా మిగిలిపోయిన 12 మున్సిపాలిటీలు, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ముమ్మరంగా సాగుతోంది. ఈ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఆ తర్వాత కూడా క్యూలైన్ లో ఉన్నవారికి అవకాశం ఇస్తారు.

ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా పెనుకొండ మున్సిపాలిటీ పరిధిలో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 17వ వార్డు పరిధిలో పోలింగ్ సరళిని పర్యవేక్షించడానికి అధికా వైసీపీకి చెందిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వచ్చారు. ఆయనను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. పోలింగ్ కేంద్రంలోకి ఎంపీ దూసుకెళ్లడానికి ప్రయత్నించారని.. ఓటర్లను ప్రభావితం చేశారని ఆరోపించారు. దీంతో రెండుపార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ క్రమంలోనే టీడీపీసీనియర్ నేత, పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి 17వ వార్డుకు వెళ్లారు. గోరంట్ల మాధవ్ తో వాగ్వాదానికి దిగారు. పోలింగ్ కేంద్రానికి ఎందుకు రావాల్సి వచ్చిందని నిలదీశారు.

ఇక రాత్రంతా డబ్బులు, చీరలు పంచారని.. పెనుకొండలో టీడీపీ నాయకులు గెలుపు కోసం అడ్డదారులు తొక్కారని ఎంపీ మాధవ్ ఆరోపించారు. దీనికి టీడీపీ నేత పార్థసారథి గట్టి కౌంటర్ ఇచ్చారు. దౌర్జన్యం ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసునని అన్నారు. ఓటర్లను ప్రలోభానికి గురిచేశారని.. ఓడిపోతారనే తెలిసే పోలింగ్ బూత్ లను ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారని ఎదురుదాడి చేశారు.

దీంతో పోలీసులు జోక్యం చేసుకొని ఇద్దరినీ శాంతపరిచి అక్కడి నుంచి పక్కకు తప్పించారు. టీడీపీ నేత పార్థసారథని పక్కకు తప్పించి ఎంపీని పరిశీలించడానికి పంపించారు. పోలీసులపై తీరుపై పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.