Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో మరో ఘోరం.. కారులో ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం!

By:  Tupaki Desk   |   7 Jun 2022 2:50 AM GMT
హైదరాబాద్ లో మరో ఘోరం.. కారులో ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం!
X
హైదరాబాద్ లో రొమేనియా బాలిక అత్యాచార ఘటనను ప్రజలు ఇంకా మరువకముందే మరో మైనర్ బాలిక కారులో అత్యాచారానికి గురయింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది. నిందితుడిని జూన్ 6న అరెస్టు చేయడంతో ఈ ఘోరం వెలుగుచూసింది.

వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్ నగరంలోని నింబోలి అడ్డాకు చెందిన అనాథ బాలిక (17) మల్లేపల్లి విజయ్‌నగర్‌కాలనీలోని ఓ హాస్టల్‌లో ఉంటోంది. అక్కడే ఉన్న ఓ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. హాస్టల్‌కు సమీపంలోని జిరాక్స్‌ షాపులో పనిచేసే సురేష్‌ (23) ఆమెపై కన్నేశాడు. ఓ ఫోనును గిఫ్టుగా ఇచ్చి పరిచయం పెంచుకున్నాడు. అప్పట్నుంచీ ఆమెకు తరచూ ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు.

ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 20న ఉదయం 9 గంటలకు కళాశాలకు వెళ్తున్నానని హాస్టల్‌లో చెప్పిన ఆ బాలిక తన ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి బయటకు వచ్చింది. తమ క్లాస్‌మేట్‌ రాహుల్‌ పుట్టిన రోజు వేడుక జరుగుతున్న నెక్లెస్‌ రోడ్డుకు వెళ్లారు.

పనిలో పనిగా సురేష్ ను కూడా బర్త్ డే పార్టీకి రావాలని బాలిక అతడిని ఆహ్వానించింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో అందరూ బర్త్‌ డే వేడుకల్లో ఉన్నారు. ఆ సమయంలో నీతో మాట్లాడాలంటూ ఆ బాలికను పిలిచిన సురేష్‌ కారులో ఎక్కించుకుని తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

తర్వాత మామూలుగా హాస్టల్‌కు వచ్చిన బాలిక కొద్దిరోజుల తర్వాత నలతగా ఉండటంతో హాస్టల్‌ సిబ్బంది ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగు చూసింది. దీంతో సురేష్‌పై ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ హుమయూన్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు అందించారు. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన హుమయూన్‌నగర్‌ పోలీసులు సంఘటన జరిగిన ప్రాంతం రాంగోపాల్‌పేట పరిధిలోకి రావడంతో ఆ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం సురేష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

కాగా, ఈ అత్యాచార ఘటనపై ప్రతిపక్ష పార్టీలు భగ్గుమన్నాయి. తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయని అన్నారు. హైదరాబాద్ హత్యలు, అత్యాచారాలు, దోపిడీలకు, డ్రగ్సుకు అడ్డాగా మారిందని నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పటికే రొమేనియా బాలికతోపాటు పహడీ షరీప్ లోనూ ఒక బాలికను అత్యాచారం చేశారని.. తాజాగా ఇప్పుడు మరోమారు అత్యాచారాలకు తెగబడ్డారని మండిపడుతున్నారు.