Begin typing your search above and press return to search.

మీరైనా.. ఎడ‌మ చేతివైపు చూడండి.. ప్లీజ్‌.. అసెంబ్లీలో అచ్చెన్న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   19 Sep 2022 11:08 AM GMT
మీరైనా.. ఎడ‌మ చేతివైపు చూడండి.. ప్లీజ్‌.. అసెంబ్లీలో  అచ్చెన్న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు
X
ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల వీరభద్రస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శాసనసభలో సభ్యులు అభినందనలు తెలియజేస్తూ కోలగట్ల గురించి పలు విషయాలు మాట్లాడారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, డిప్యూటీ స్పీకర్ వీర‌భ‌ద్ర స్వామికి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సభలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... ముందుగా డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన కోలగట్లకు అభినందనలు తెలియజేశారు. రెండు పర్యాయాలు శాసనసభ సభ్యులుగా, ఒక పర్యాయం శాసన మండలి సభ్యులుగా కొలగట్లకు అనుభవం ఉందని అన్నారు.

"ప్రధానమైన రైతుల సమస్యలపై చర్చ ఉంది... అయినా మీ ఎన్నిక ఉన్నందున టీడీపీ తరపున తమను గౌరవించుకుంటున్నాం. ఇకపై రాజకీయ పార్టీలతో సంభందం లేదని అనుకుంటున్నా. సభాపతి కుడిచేతి వైపే చూస్తారు మీరైనా ఎడమచేతి వైపు చూసి మాకు అవకావం ఇవ్వాలని కోరుతున్నాం" అని అచ్చెన్నాయుడు అన్నారు. అంతేకాదు.. "మీరైనా.. ఎడ‌మ చేతి వైపు చూడండి.. ప్లీజ్‌" అని మ‌రో సారి వ్యాఖ్యానించారు. దీంతో ఒక్క‌సారిగా స‌భ‌లో నవ్వులు విరిశాయి.

ఇక‌, డిప్యూటీ స్పీక‌ర్‌.. కోల‌గ‌ట్ట మాట్లాడుతూ.. సభా మర్యాదను కాపాడేందుకు కృషి చేస్తానని తెలిపారు. సభ గౌరవాన్ని పెంచేలా సభ్యులు వ్యవహరించాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా పనిచేసేవారు.. ప్రజలు గమనిస్తున్నారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. సభ్యుల తమ సహాకరం అందిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. '

'ఈ స్థానానికి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాక వచ్చాను. సభలో ఉండగా రాజకీయాలు ఉండవు బయట మాత్రం రాజకీయ నాయకుడిగానే వ్యవహరిస్తాను. అచ్చన్నాయుడు, వారి సభ్యులు తమ సీట్లలో కూర్చు ని ఉంటే వారి వైపు చూసే అవకాశం ఉంటుందని వారికి తెలియజేస్తున్నాను' అంటూ అచ్చెన్నాయుడు వ్యాఖ్యలకు కోలగట్ల వీరభద్రస్వామి సమాధానం ఇచ్చారు. మరోవైపు డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు స్పీకరించిన వెంటనే టీడీపీ సభ్యుల వాయిదా తీర్మానాన్ని వీరభద్రస్వామి తిరస్కరించారు.

కొస‌మెరుపు: ఈ ప‌రిణామాలు మీడియా గ్యాల‌రీ నుంచి వీక్షించిన ప‌లువురు పాత్రికేయులు.. "బాగానే స‌హ‌క‌రిస్తున్నారుగా" అని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.