Begin typing your search above and press return to search.

ఆ వివాదస్పద జీవోపై హైకోర్టులో ఆసక్తికర పరిణామాలు!

By:  Tupaki Desk   |   12 Jan 2023 9:30 AM GMT
ఆ వివాదస్పద జీవోపై హైకోర్టులో ఆసక్తికర పరిణామాలు!
X
ఇటీవల కందుకూరు, గుంటూరుల్లో టీడీపీ, ఉయ్యూరు ఫౌండేషన్‌ కార్యక్రమాల్లో తొక్కిసలాటలు జరిగి 11 మంది మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచార యావతో ఇరుకు సందుల్లో సభలు నిర్వహించడం వల్లే తొక్కిసలాటలు జరిగాయని.. అమాయకుల చావుకు చంద్రబాబే కారణమని వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు.

మరోవైపు చంద్రబాబు సభలకు వస్తున్న జనాన్ని చూసి తట్టుకోలేక దురుద్దేశపూర్వకంగానే వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో రోడ్లపై బహిరంగ సభలు, రోడ్‌ షోలను నిషేధిస్తూ జగన్‌ ప్రభుత్వం జీవో నంబర్‌ 1 తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ జీవోపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ప్రతిపక్షాల సభలను, ర్యాలీలను, రోడ్‌ షోలను అడ్డుకోవడానికి కావాలనే జగన్‌ ప్రభుత్వం ఈ చీకటి జీవో తెచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

కాగా ఈ జీవోను రద్దు చేయాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని రామకృష్ణ కోర్టును అభ్యర్థించారు. మరోవైపు
ఈ పిటిషన్‌ను అత్యవసర విచారణకు తీసుకోనవసరం లేదని అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ తెలిపారు. ప్రస్తుతం ఉన్న హైకోర్టు ధర్మాసనానికి పిల్‌ను విచారించే అధికారం లేదని అడ్వకేట్‌ జనరల్‌ స్పష్టం చేయడం సంచలనంగా మారింది.

ఈ నేపథ్యంలో సీపీఐ నేత రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌ ను తామే అత్యవసరంగా విచారిస్తామని వెకేషన్‌ కోర్టు తెలిపింది. కాగా, హైకోర్టు విచారణలో భాగంగా ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. రామకృష్ణ దాఖలు చేసిన పిల్‌పై ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేదన్నారు. నిబంధనల ప్రకారం ఈ కేసు రోస్టర్‌లో రావడానికి ఆస్కారం లేదని ఏజీ శ్రీరామ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.

వెకేషన్‌ బెంచ్‌ విధాన నిర్ణయాల కేసులను విచారించకూడదన్నారు. జడ్జీలను ఎంపిక చేసుకోవడంలో భాగంగా ఒక రాజకీయ పార్టీ దీన్ని ఉపయోగించుకుంటోందిఉ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో రామకృష్ణ దాఖలు చేసిన పిల్‌ విచారణను హైకోర్టు వాయిదా వేసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.