Begin typing your search above and press return to search.

2019 ప్ర‌ధానిపై దీదీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   13 May 2018 1:06 PM GMT
2019 ప్ర‌ధానిపై దీదీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు
X
ఏళ్ల‌కు ఏళ్లు అధికారంలో ఉన్నా.. ప్ర‌ధాన‌మంత్రి కుర్చీలో కూర్చునే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ.. త‌న‌లో అంత నైపుణ్యం లేద‌న్న ఉద్దేశంతో వెన‌క‌డుగు వేసిన రాహుల్ గాంధీ.. గ‌డిచిన నాలుగేళ్లుగా త‌మ‌కు ఎదురువుతున్న అనుభ‌వాల నేప‌థ్యంలో ప్ర‌ధాని కావాల‌న్న త‌న కోరిక‌ను చెప్ప‌క త‌ప్ప‌లేదు. రానున్న రోజుల్లో కాబోయే ప్ర‌ధాని తానేన‌ని రాహుల్ ఇప్ప‌టికిప్పుడు చెప్పాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌న్న సందేహం రావొచ్చు.

మోడీపై దేశ వ్యాప్తంగా వ్య‌తిరేక‌త అంత‌కంత‌కూ పెరుగుతున్న వేళ‌.. ఆయ‌న్ను ఢీ కొట్ట‌నున్న‌ది తానేన‌ని చెప్ప‌టం ద్వారా రాజ‌కీయాన్ని మ‌రింత వేడెక్కించ‌టంతో పాటు.. పోరుకు తాను సిద్ధ‌మ‌ని చెప్ప‌టం రాహుల్ ల‌క్ష్యంగా చెప్పాలి. మోడీకి వ్య‌తిరేకంగా జ‌త క‌ట్టాల‌ని భావిస్తున్న రాజ‌కీయ ప‌క్షాలు ఏకీకృతం కావ‌టం అవ‌స‌ర‌మైన నేప‌థ్యంలో.. ఆ దిశ‌గా అడుగులు ప‌డేందుకు రాహుల్ త‌న మ‌న‌సులోని కోరిక‌ను వెల్ల‌డించిన‌ట్లుగా చెప్పాలి.

రాహుల్ కోరిక‌ను ప్ర‌ధాని మోడీ స్పందిస్తూ అహంకారపూరిత వ్యాఖ్య‌లుగా అభివ‌ర్ణించ‌టం తెలిసిందే. అయితే.. మోడీ వ్యాఖ్య‌ల‌పై ప‌లు విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. రాహుల్ ను త‌ప్పు ప‌ట్టే నైతిక‌త మోడీకి ఎక్కడ ఉంద‌న్న మాట‌ను ప‌లువురి నోటి నుంచి రావ‌టం మ‌ర్చిపోకూడ‌దు.

ఇదిలా ఉంటే.. రాహుల్ ప్ర‌ధాని కోరిక‌పై ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెనర్జీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మోడీ మాదిరి కాకుండా.. ఆమె చేసిన విశ్లేష‌ణ వాస్త‌వానికి ద‌గ్గ‌ర‌గా ఉండ‌టం కొంత‌లో కొంత మెరుగ‌ని చెప్పాలి. ఎవ‌రి అభిప్రాయాలు వారు చెప్పుకునే హ‌క్కు ఉంద‌న్న ఆమె.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు గెలుచుకునే అవ‌కాశం లేద‌ని దీదీ స్ప‌ష్టం చేశారు. అంతేకాదు.. కాంగ్రెస్ సొంతంగా ఎక్కువ సీట్లు ద‌క్కించుకునే వీలు లేద‌ని చెప్పారు.

మొద‌టిసారి కేసీఆర్ సంతోష‌ప‌డే మాట‌ను చెప్పారు మ‌మ‌తా. 2019 ఎన్నిక‌ల్లో ఫెడ‌ర‌ల్ ఫ్రంటే శ‌ర‌ణ్య‌మ‌ని చెప్ప‌టం ద్వారా ఇంత‌కాలం కేసీఆర్ వెన్నంటి మ‌మ‌త లేర‌న్న ప్ర‌చారంలో నిజం లేద‌ని చెప్పిన‌ట్లైంది.  ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కు నేతృత్వం వ‌హిస్తారా? అన్న ప్ర‌శ్న‌కు మ‌మ‌త నోటి నుంచి మాట రాక‌పోవ‌టం గ‌మ‌నార్హం. క‌ర్ణాట‌క‌లో ఏ పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశం ఉంద‌న్న ప్ర‌శ్న‌కు.. ఏ పార్టీకి మెజార్టీ వ‌చ్చే అవ‌కాశం లేద‌ని.. జేడీఎస్ కింగ్ మేక‌ర్ గా అవ‌త‌రించొచ్చ‌ని చెప్పారు. ఒక‌వేళ కింగ్ అయినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌న్న వ్యాఖ్య‌ను చూస్తే.. క‌ర్ణాట‌క‌లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాన్ని మ‌మ‌త గుర్తించారా? అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.