Begin typing your search above and press return to search.

వివేకా హత్య కేసులో ఛార్జిషీట్ చెప్పిన సంచలనాలు

By:  Tupaki Desk   |   15 Feb 2022 3:12 AM GMT
వివేకా హత్య కేసులో ఛార్జిషీట్ చెప్పిన సంచలనాలు
X
ఎంత కఠినమైన మనసు కాకుంటే దారుణ హత్యకు గురై.. రక్తపు మడుగులో పడి ఉంటే.. గుండెపోటు థియరీని తెర మీదకు తీసుకురావటం.. పనివాళ్లతో బెడ్రూం.. బాత్రూంలో రక్తపు మరకల్ని శుభ్రం చేయించి.. వివేకా శరీరంపై ఉన్న గాయాలు కనిపించకుండా చక్కగా కట్లు కట్టించి.. అంబులెన్సులో పులివెందుల ఆసుపత్రికి తరలించటాన్ని ఏమనాలి? ఇంతకు మించిన దారుణం ఇంకేం ఉంటుంది?

వివేకా హత్య కేసులో కీలక నిందితుడిగా భావిస్తూ.. ప్లానింగ్ మొత్తం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ5 దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అలియాస్ డి.శంకర్ రెడ్డి విషయానికి వస్తే ఇతడు కడప ఎంపీ అవినాశ్ రెడ్డి.. ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడన్న సంగతి అందరికి తెలిసిందే.

హత్య జరిగిన తర్వాత వివేకా ఇంటికి చేరుకున్న శంకర్ రెడ్డి.. ఈ హత్య కేసులో ఏ1గా ఉన్న నిందితుడు ఎర్ర గంగిరరెడ్డి చేత రక్తపు మరకల్ని శుభ్రం చేయించి.. హత్య ఆధారాలు చెరిపేయటంలో కీలక పాత్ర పోషించారు. హత్య చేసినట్లుగా అంగీకరిస్తే గంగాధర్ రెడ్డికి రూ.10కోట్లు ఇస్తామని శంకర్ రెడ్డి ఆఫర్ కూడా ఇచ్చినట్లుగా తెలిపింది.

చార్జిషీట్ లో ఉన్న మరికొన్ని అంశాలు..

- ఏ-4 దస్తగిరి అప్రూవర్‌గా మారాడు. వివేకా హత్యలో దాగి ఉన్న కుట్ర, సాక్ష్యాలను తారుమారు చేయడంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాం. ఏ-5 నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిపై విచారణ జరిపి.. వివేకా హత్య సాక్ష్యాధారాలను అతడు నాశనం చేసినట్లు గుర్తించాం. గత ఏడాది నవంబరు 17న అరెస్టు చేశాం.

- వివేకా శరీరంపై ఏడు గాయాలున్నాయి. మెదడుకు బలమైన గాయంతోనే మృతిచెందారు.

- వివేకా మద్దతుదారులను కంట్రోల్‌ చేయాలని సీఐ శంకరయ్యకు శివశంకర్‌ రెడ్డి చెప్పాడు. అలాగే.. వివేకా రక్తపు వాంతులు, గుండెపోటుతో మరణించినట్లు మెసేజ్‌ చేయాలని సీఐని బెదిరించాడు.

- వివేకా ఇంటి పనిమనిషి రాగిరి లక్ష్మి ద్వారా రక్తపు మరకలు తొలగించడంలో శివశంకర్‌రెడ్డి, గంగిరెడ్డిలు కీలకంగా వ్యవహరించారు.

- దూది, బ్యాండేజీ, బాడీ ఫ్రీజర్‌ ఏర్పాటు చేయడంలోనూ వీరిద్దరే ప్రముఖ పాత్ర పోషించారు.

- కాంపౌండర్‌ గజ్జల జయప్రకాశ్‌రెడ్డి సహకారంతో శివశంకర్‌రెడ్డి, గంగిరెడ్డి రూంకు గడిపెట్టుకొని కట్టు కట్టడమే కాకుండా.. బాత్‌రూం, బెడ్‌రూంలో రక్తపు మరకలు శుభ్రం చేసి సాక్ష్యాధారాలను నాశనం చేయడంలో పాలుపంచుకున్నారని పనిమనిషి లక్ష్మి, ప్రకాశ్‌, ఇతర సాక్షులు టి.మధుసూనరెడ్డి, ఆర్‌. వెంకటరమణలు చెప్పారు.

- వివేకా గుండెపోటుతో చనిపోయినట్లు తనకు శివశంకర్‌రెడ్డే సమాచారం ఇచ్చాడని సాక్షి టీవీ రిపోర్టరు బాలకృష్ణారెడ్డి తెలిపాడు. టీవీ వీడియో ఫుటేజీని ఆ టీవీ నుంచి స్వాధీనం చేసుకున్నాం.

- శివశంకర్‌రెడ్డి, గంగిరెడ్డి.. వివేకా ఇంటికి చేరుకుని హత్యకు సంబంధించిన ఆధారాలు తొలగించాలని చూశారే తప్ప.. వివేకా కుమార్తెకు సమాచారం ఇవ్వలేదు.

- వివేకా కుమార్తె లేకుండానే మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేశారు. తప్పుడు సమాచారం, అసంపూర్తి సమాచారంతో ఎంవీ కృష్ణారెడ్డి ద్వారా ఫిర్యాదు చేయించి దానినే ఎఫ్‌ఐఆర్‌గా నమోదు చేయాలని సీఐ శంకరయ్యను శివశంకర్‌రెడ్డి బలవంతం చేశారు.

- వివేకా హత్యకు నెల రోజుల ముందే ప్రణాళిక రూపొందించినట్లు ఏ-4 షేక్‌ దస్తగిరి విచారణలో వెల్లడించాడు. శివశంకర్‌రెడ్డి, మరికొందరు పెద్దలు కలసి వివేకాను హత్య చేయడానికి రూ.40 కోట్లకు ఒప్పందం కుదిరిందని గంగిరెడ్డి చెప్పినట్లు తెలిపాడు.

- 2019 మార్చి 15న సునీల్‌ యాదవ్‌.. దస్తగిరిని, మరో ఇద్దరు నిందితులను పిలిచి ఎలాంటి ఆందోళన చెందవద్దని చెప్పాడు. శివశంకర్‌రెడ్డి, అతడు సన్నిహితంగా ఉండే సీనియర్‌ నాయకులు అన్నిటినీ చూసుకుంటారు.. డబ్బు తర్వాత మీకు అందుతుందని గంగిరెడ్డి హామీ ఇచ్చాడు. అదే రోజు పోలీసులు దస్తగిరి, ఇతర నిందితులను పిలిపించారు. ఆదోళన చెందవద్దని, హత్యకు సంబంధించిన ఆధారాలు చెరిపేసి నాశనం చేశామని గంగిరెడ్డి వారికి చెప్పాడు.

- పోస్టుమార్టం రిపోర్టులో వివేకా మరణానికి ముందు తల.. నుదురు.. అరచేతిపై ఏడు గాయాలు ఉన్నాయి. హెమరేజిక్ షాక్ తో పాటు మెదడుకు తీవ్ర గాయాలు కావటంతో చనిపోయినట్లుగా పేర్కొన్నారు. గొడ్డలితో వివేకాను హత్య చేసి ఉండొచ్చని వైద్యులు తమ నివేదికలో పేర్కొన్నారు.