Begin typing your search above and press return to search.

ఆయన పార్టీ మార్పుపై మంత్రి బాలినేని ఆసక్తికర వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   4 Jan 2021 11:45 AM GMT
ఆయన పార్టీ మార్పుపై మంత్రి బాలినేని ఆసక్తికర వ్యాఖ్యలు
X
ప్రకాశం జిల్లాలో రాజకీయ వేడి రగులుకుంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత డేవిడ్ రాజు టీడీపీలో చేరుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. దీనిపై మంత్రి బాలనేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు.

పార్టీలో కష్టపడి పనిచేసిన వారికే సముచిత స్థానం ఉంటుందన్నారు. పార్టీలో పదవులు రానంత మాత్రాన వేరే పార్టీకి వెళ్లడం వారి ఇష్టమన్నారు. ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన ఆయనకు అన్ని విధాలుగా అండగా ఉన్నామన్నారు.

పార్టీలు మారుతూ పదవులు కావాలంటే ఇచ్చే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు. గతంలో ఒకసారి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన డేవిడ్ రాజు టీడీపీలో చేరారని.. అలాంటి వ్యక్తులు పార్టీ నుంచి వెళ్లినంత మాత్రాన వైసీపీకి ఎలాంటి నష్టం జరగదని మంత్రి బాలినేని స్పష్టం చేశారు.

వైసీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు కొద్దిరోజులుగా అధికార పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని అసంతృప్తితో ఉన్నాడట.. ఈ క్రమంలోనే ఒంగోలులోని తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించినట్టు టాక్. యర్రగొండపాలెం కార్యకర్తలు తనను టీడీపీలోకి రమ్మంటున్నారని.. చంద్రబాబు ఓకే అంటే తాను టీడీపీ చేరేందుకు సిద్ధమని డేవిడ్ రాజు అన్నట్టు ప్రచారం సాగుతోంది.

1999లో డేవిడ్ రాజు సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో వైసీపీలో చేరి యర్రగొండపాలెం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. 2019లో టికెట్ దక్కకపోవడంతో తిరిగి వైసీపీలో చేరారు. ఇప్పుడు మళ్లీ టీడీపీ బాటపడుతున్నారన్న ప్రచారం సాగుతోంది.