Begin typing your search above and press return to search.

మంత్రి వర్గ విస్తరణ.. మళ్లీ మొదటికి వచ్చిన లొల్లి!

By:  Tupaki Desk   |   18 Jun 2019 7:09 AM GMT
మంత్రి వర్గ విస్తరణ.. మళ్లీ మొదటికి వచ్చిన లొల్లి!
X
కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వంలోని కేబినెట్‌ లో చోటు ఆశించి భంగపడ్డ కాంగ్రెస్‌ సీనియర్లు అయోమయంలో పడ్డారు. పార్టీలో ఉండాలా? వీడాలా? అనే సందిగ్దంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉండిపోయారు. కాంగ్రెస్‌ లో ఎన్నో ఏళ్లుగా జెండా మోసినా తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని వాపోతున్నారు. అయితే బీజేపీలో చేరినా.. భవిష్యత్తు ఉంటుందా? అనే ప్రశ్నలు వారిని వెంటాడుతున్నాయి. కాంగ్రెస్‌ లో కేబినెట్‌ ర్యాంకు రాలేదు.. బీజేపీలో చేరగానే ఇస్తారనే నమ్మకం కూడా లేకుండా పోయింది. దీంతో ఉండాలా? వెళ్లాలా? అనే సందిగ్ధంలో పడ్డారు.

కాంగ్రెస్‌ నుంచి సుమారు 20 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై అసమ్మతి వ్యక్తం చేస్తూ రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారందరు మూకుమ్మడిగా బీజేపీలో చేరినా.. వచ్చే ప్రయోజనం ఏమీ లేదని గ్రహించారు. ఫలితంగా పార్టీ అధిష్టానం చెప్పినట్లు వినడం తప్ప వేరే మార్గం లేదని గుసగుసలు మాట్లాడుతున్నారు. ఒకవేళ పార్టీ మారితే.. అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్‌ అనర్హత వేటు వేస్తే మళ్లీ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుందనే భయం వెంటాడుతోంది. ఫలితంగా సొంత పార్టీలోనే ఉండి పోరాడితే ఏదో నామినేటెడ్‌ పోస్టు పొందవచ్చని అసమ్మతిగానే కొనసాగుతున్నారు.

సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా రెండోసారి కేబినెట్‌ విస్తరణ అనంతరం కాంగ్రెస్‌ లోని అసంతృప్త ఎమ్మెల్యేల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. పార్టీలో ఉండాలా? వద్దా? అని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో భవిష్యత్తు ప్రణాళిక రచించేందుకు మాజీ మంత్రి రమేశ్‌ జార్కిహోళి నివాసంలో పలువురు రహస్యంగా సమావేశమై చర్చించారు. మస్కి ఎమ్మెల్యే ప్రతాప్‌ గౌడ పాటిల్- అథణి ఎమ్మెల్యే మహేశ్‌ కుమటళ్లి భేటీ అయి సుదీర్ఘంగా చర్చించారు. అయితే ఈ భేటీపై మీడియా ప్రతినిధులు సంప్రదించగా.. రమేశ్‌ జార్కిహోళి ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదు. అయితే సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం తమకు లేదని ప్రతిపక్ష నేత బీఎస్‌ యడ్డూరప్ప స్పష్టం చేశారు. కానీ కాంగ్రెస్‌ – జేడీఎస్‌ లోని అసంతృప్త ఎమ్మెల్యేలు బీజేపీలోకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని చెప్పారు. పాలక పక్షాల నుంచి సుమారు 20 మంది ఎమ్మెల్యేలు అసమ్మతితో ఉన్నట్లు తమకు సమాచారం వచ్చిందని తెలిపారు.

కాంగ్రెస్‌ – జేడీఎస్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా ఇద్దరు స్వతంత్య్ర ఎమ్మెల్యేలకు కేబినెట్‌ అవకాశం కల్పించడంతో సమస్య తలెత్తింది. ఇన్నాళ్లూ పార్టీ జెండా మోసిన వారు అసమ్మతిగా ఉన్నారు. కేబినెట్‌ లో కాంగ్రెస్‌ కోటా (22 స్థానాలు) భర్తీ అయింది. దీంతో ఆ పార్టీ నేతలకు కేబినెట్‌ చాన్స్‌ ఇవ్వాలంటే కొందరిని తొలగించి అసమ్మతి నేతలను చేర్చుకోవాలి. అయితే తొలగించిన వారి నుంచి మరో అసమ్మతి వర్గం ఏర్పడుతుంది. ఎన్నాళ్లు ఇలా.. తొలగిస్తూ.. చేరుస్తూ పోవాలని.. పార్టీ పెద్దలు చొరవ తీసుకుని నియంత్రించాలని జేడీఎస్‌ నేతలు సలహాలు ఇస్తున్నారు. దీంతో కాంగ్రెస్‌ నేతలు అయోమయంలో పడ్డారు.