Begin typing your search above and press return to search.

తాలిబన్ల ప్రభుత్వంలో అంతర్గత కుమ్ములాట...ఆ కీలక నేత అలక

By:  Tupaki Desk   |   18 Sep 2021 1:30 AM GMT
తాలిబన్ల ప్రభుత్వంలో అంతర్గత కుమ్ములాట...ఆ కీలక నేత అలక
X
అమెరికా తన సైన్యాన్ని వెనక్కి తీసుకుపోవడంతో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అఫ్గనిస్థాన్‌‌లో తాలిబన్లు మళ్లీ పాగా వేశారు. అయితే, తాలిబన్లు ప్రస్తుతం అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటు విషయంలోనే తొలుత విబేధాలు తలెత్తాయి. ఈ విషయంలో పాక్ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించి, తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి సహకరించింది. కానీ, తాత్కాలిక క్యాబినెట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి కుమ్ములాటలు మరింత పెరిగినట్లు సమాచారం. అమెరికాపై ఉగ్రదాడికి ముందు అధికారంలో ఉన్న తాలిబన్లు అరాచక పాలన సాగించారు.

ఈసారి తమ పాలన అందర్నీ మెప్పించేలా ఉంటుందని అఫ్గన్‌ ను ఆక్రమించుకున్న తర్వాత తాలిబన్లు ప్రకటించారు. అన్ని వర్గాలను కలుపుకొని సమ్మిళిత ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. తాత్కాలిక ప్రభుత్వంలో ఐక్యరాజ్యసమితి, అమెరికా నిషేధిత జాబితాలోని కరడుగట్టిన ఉగ్రవాదులే మంత్రులుగా నియమితులయ్యారు. ఈ నియామకాలపైనే తాలిబన్లలోని ఆచరణవాదులు, సిద్ధాంతకర్తల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్నట్లు సమాచారం. ఈ విషయమైన ఇరు వర్గాల మధ్య అధ్యక్ష భవనంలో పెద్ద గొడవ జరిగినట్టు ప్రచారం జరిగింది.

ఆచరణవాదుల వర్గానికి నేతృత్వం వహిస్తున్న ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ ఘర్షణలో మృతిచెందారని కూడా ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, తాను బతికే ఉన్నానంటూ తొలుత ఓ ప్రకటన విడుదల చేసిన బరాదర్‌, బుధవారం ఓ వీడియోలో కనిపించారు. ఆయన ఆకాంక్షలకు విరుద్ధంగా క్యాబినెట్‌ ఏర్పాటు కావడం బరాదర్‌కు నచ్చడం లేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అందుకే డిప్యూటీ ప్రధాని పదవిలో కొనసాగుతున్నప్పటికీ పలు అధికారిక కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారని తెలిపాయి.

రాజకీయ కార్యకలాపాలకు వేదికగా ఉన్న ఖతార్ నుంచి ఆ దేశ విదేశాంగ మంత్రి షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ అబ్దుర్‌ రహమాన్‌ అల్‌-థనీ అఫ్గన్‌ పర్యటనకు రాగా.. ఆయనకు స్వాగత కార్యక్రమానికి బరాదర్‌ దూరంగా ఉన్నారు. అమెరికాతో శాంతి ఒప్పందంలో అత్యంత క్రియా శీలకంగా వ్యవహరించిన ఆయన ప్రస్తుతం అలకబూని అంటీముట్టనట్టుగా వ్యవహరించడం తాలిబన్‌ సర్కారుకు ఇబ్బందికరంగా మారే అవకాశముందని పేర్కొన్నాయి. అఫ్గన్‌ ను ఆక్రమించుకున్న తర్వాత సమ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని ప్రకటించిన తొలి తాలిబన్ సీనియర్ నేత బరాదర్. ఇక, రాజధాని కాబూల్‌ను ఆక్రమించుకున్న తర్వాత అఫ్గన్ అధ్యక్ష భవనంపై జాతీయ జెండా స్థానంలో తాలిబన్లు వారి జెండాను ఎగురవేశారు.ఈ విషయమై కూడా తీవ్ర చర్చ జరుగుతున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జెండాపై తమ నాయకత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, చివరికి రెండింటినీ పక్కపక్కనే ఎగరేసేందుకు చాలామంది మొగ్గు చూపుతున్నారని తాలిబాన్ అధికారి ఒకరు తెలిపారు.